పండగకు ఊరెళ్తున్నారా? జాగ్రత్తలివిగో : ఎస్పీ సింధూశర్మ

  • కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ    

కామారెడ్డి టౌన్, వెలుగు: సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులు, నగదు ఇండ్లలో ఉంచకుండా బ్యాంక్​ లాకర్లలో లేదా తమకు భద్రంగా ఉన్న చోట దాచుకోవాలని సూచించారు. బీరువాకు తాళాలు వేసి తాళంచెవులు ఇంట్లోనే పెట్టకుండా వెంట తీసుకెళ్లాలన్నారు. ఇంటి మెయిన్​డోర్​కు సెంటర్ లాక్ వేయాలన్నారు. తాళం వేసి ఊరెళ్లేటప్పుడు నమ్మకం ఉన్న వ్యక్తులకు లేదా పోలీస్​ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలన్నారు.

ఇండ్లలో, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, వాటిని మొబైల్​ ఫోన్లకు అనుసంధానం చేసుకుంటే మంచిదన్నారు. బస్సు, రైలు ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు తీసుకోవద్దని, బ్యాగ్​లు  జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే  డయల్ 100 లేదా  ​8712686133కు సమాచారం ఇవ్వాలన్నారు.