కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురి దారుణ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్తి కోసం స్నేహితుడితోపాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లను హత్యే చేసిన నిందితుడు ప్రశాంత్ తోపాటు అతనికి సహకరించిన మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 19వ తేదీ మంగళవారం కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ.. ఈ కేసు వివరాలను మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.
"మాక్లూరులో ఉన్న ప్రసాద్ ఇంటిపై అతని స్నేహితుడు ప్రశాంత్ కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఇంటిని అతని పేరిట రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్‌ను ప్రసాద్ ఒత్తిడి చేశాడు. దీంతో ప్రసాద్ తోపాటు అతని కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రశాంత్ ప్లాన్ చేసి చంపాడు. గత నెల 29న మాక్లూర్ మండలం మదనపల్లి వద్ద అటవీ ప్రాంతంలో నిందితులు ప్రశాంత్, వంశీ, విష్ణులు రాళ్ళు, కర్రలతో కొట్టి ప్రసాద్ ను హత్య చేసి... మదనపల్లి అటవీ ప్రాంతంలోనే ప్రసాద్ ను పూడ్చి పెట్టారు.
డిసెంబర్ 1న ప్రసాద్ భార్య శాన్విక, చెల్లెలు శ్రావణిని నిందితుడు ప్రశాంత్ నిజామాబాద్ తీసుకెళ్లాడు. శన్వికను భర్త దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి బాసర వంతెన వద్ద తాడుతో గొంతు బిగించి చంపి గోదావరి లో పడేశారు. ప్రసాద్ దగ్గరికి వెళ్దామని చెప్పి శ్రావణిని సైతం తీసుకెళ్లి మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద చంపి తగులబెట్టారు. ప్రసాద్ తల్లి, పిల్లలు, మరో చెల్లెలిని ప్రసాద్ దగ్గరికి వెళ్దామని చెప్పి.. నిందితుడు ప్రశాంత్ వారిని నిజామాబాద్ లో లాడ్జిలో ఉంచాడు. ఈనెల 4న ప్రసాద్.. పిల్లల్ని చూడాలని అడిగాడని చెప్పి పిల్లలను తన మైనర్ తమ్ముడితో కలిసి తీసుకెళ్లి చంపి మెండోర సొన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేశారు. ఈనెల 13న మరో చెల్లెలు స్వప్నను సదాశివనగర్ మండలం భుంపల్లి వద్ద గొంతు నులిమి చంపి పెట్రోల్ పోసి తగులబెట్టారు.
కుటుంబ సభ్యులు ఎవ్వరూ తిరిగి రాకపోగా అనుమానంతో లాడ్జి నుంచి ప్రసాద్ తల్లి తప్పించుకుని పారిపోయింది. ఆమె కోసం కామారెడ్డి జిల్లా పాల్వంచ కు వస్తుండగా ప్రశాంత్, వంశీ, విష్ణు మైనర్ బాలుడిని కామారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన ప్రసాద్ కుటుంబ సెల్ ఫోన్ లు నిందితుడి వద్ద లభించాయి. ప్రసాద్ తల్లిని కూడా చంపాలని ప్రశాంత్ భావించాడు. నాలుగు మృతదేహాలు లభించాయి.ప్రసాద్, ప్రసాద్ భార్య మృతదేహాలు ఇంకా లభించలేదు" అని వెల్లడించారు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరపర్చి రిమాండ్ కు తరలించనున్నట్లు ఎస్పీ సింధూ శర్మ తెలిపారు.