- పొలాల్లోనే వండుతూ.. కిలో రూ.100 అమ్మకం
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మళ్లీ బెల్లం గుమ గుమ తాడుతోంది. రైతులు బెల్లం తయారీ పై ఆసక్తి చూపుతున్నారు. చెరుకు పంట సాగు చేస్తున్న కొందరు పొలాల్లోనే బెల్లం వండి అమ్ముతున్నారు. ఇక్కడి బెల్లంకు మంచి డిమాండ్ కూడా ఉంది. కిలో రూ.100 విక్రయిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తుండగా పొలాల వద్దకే వెళ్లి జనం కొంటున్నారు. ఉమ్మడి ఏపీలో బెల్లం ఉత్పత్తిలో కామారెడ్డి ప్రసిద్ధి చెందింది.
ఇక్కడి రైతులు చెరుకు పంట సాగు చేసి బెల్లాన్ని తయారు చేసేవాళ్లు. కామారెడ్డి గంజ్( మార్కెట్) కిటకిటలాడేది. ఉమ్మడి ఏపీతో పాటు మహారాష్ర్ట, గుజరాత్, కర్నాటకకు ఎగుమతి అయ్యేది. సమ్మక్క, సారక్క జాతరకు భారీగా తరలేది. కామారెడ్డి ఏరియాలో నేలల స్వభావం దృష్ట్యా కొంత నలుపు, ఎరుపు రంగులో వస్తుంది. కాగా.. నల్లబెల్లంగా ముద్ర వేసి, గుడుంబా తయారీకి వెళ్తుందని ఉమ్మడి పాలకులు ఆంక్షలు విధించారు. దీంతో 2002 నుంచి బెల్లం తయారీ తగ్గింది. క్రమంగా కంప్లీట్‌గా బంద్ అయింది. గతంలో ఆయా పార్టీల పెద్దలు బెల్లం రవాణాపై ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పినా నెరవేర్చలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంక్షల కారణంగా బంద్
గతంలో చెరుకు ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ వందలాది మంది రైతులు బెల్లం తయారు చేసేవాళ్లు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందారు. ప్రస్తుతం 18 వేల ఎకరాల్లో చెరుకు పంట సాగవుతోంది. దాన్ని షుగర్ ఫ్యాక్టరీకి పంపేవాళ్లు. సరైన గిట్టుబాటు ధర రావట్లేదని, ఇతరత్రా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కొందరు రైతులు గతేడాది నుంచి బెల్లం తయారు చేస్తున్నారు. భిక్కనూరు మండల కేంద్రంతో పాటు రామేశ్వర్‌పల్లి, సదాశివనగర్ మండలం కుప్పియాల్లో రైతులు తయారు షురూ చేశారు. 1 కిలో రూ.100 అమ్ముతున్నారు. స్థానికులతో పాటు హైదరాబాద్ తదితర ఏరియాలకు చెందిన వాళ్లు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
ప్రభుత్వం చొరవ చూపితే..
బెల్లం రవాణాపై ఆంక్షల సడలింపుతో పాటు, తయారీపై రైతులకు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే క్వాలిటీ బెల్లం వస్తుంది. ఆహార ఉత్పత్తులు తయారీ చేసి అమ్మకాలు చేస్తే స్థానికులతో ఉపాధి దొరుకుతుంది. ఇక్కడి బెల్లంలో ఐరన్ పర్సేంటేజీ ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. నిరుడు బెల్లం తయారీ చేస్తున్న రైతుల వద్దకు ఎక్సైజ్ అధికారులు వెళ్లి వివరాలు ఆరా తీశారు. అయితే తాము స్థానిక అవసరాలకు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నామని, ఇండ్లలో వాడుకునేందుకు అమ్ముతున్నామని రైతులు తెలిపారు. కొనుగోలు చేసే వారి పేర్లు బుక్‌లో రాసి ఉంచాలని సూచించారు.
తాతల నాటి నుంచి వండుతున్రు
మా తాత, తండ్రుల కాలం నుంచి బెల్లం వండేవాళ్లు. నేను కూడా చాలా ఏండ్లు వండినా. అప్పట్లో దీపావళి నుంచి ఉగాది వరకు ఏ ఊర్ల చూసినా గిరకల చప్పుడు వినిపించేది. సర్కార్ ఆంక్షలు పెట్టడంతో ఇబ్బందులు వచ్చాయి. ఫ్యాక్టరీకి చెరుకు పంపితే అనేక కష్టాలు పడ్డా. నిరుటి నుంచి మళ్లీ బెల్లం తయారీ షురూ చేసినా. నాకున్న భూమితో పాటు కౌలుకు తీసుకొని 7 ఎకరాల చెరుకు సాగు చేసినా..
జేపీ రామాగౌడ్, భిక్కనూరు
ప్రభుత్వం ప్రోత్సహించాలి
రైతులు బెల్లం తయారీ చేసేలా ప్రభుత్వమే ప్రోత్సహించాలి. వేరే పంటలు పెట్టి ఇబ్బందులు పడే బదులు ఎక్కువమంది చెరుకు పంట సాగు చేసి ఇంకా ఎక్కువగా వండుతారు. మన బెల్లం మన వాళ్లకే అమ్ముకోవచ్చు. ఎక్సైజ్ అధికారులు నిరుడు చెప్పటంతో కొనేవాళ్ల పేర్లు రాసుకుంటున్నాం.
రవి, రామేశ్వర్‌పల్లి