కట్టిన్రు.. వదిలేసిన్రు అయిదేళ్లుగా వృథాగా రైతు బజార్

  •     రోడ్లపైనే కూరగాయల అమ్మకాలు
  •     ఎస్టేట్​ఆఫీసర్​ను నియమించడంలోనూ అలసత్వం
  •     భారంగా తైబజార్​

కామారెడ్డి, వెలుగు: కష్టపడి పండించిన పంటను అమ్ముకోడానికి రైతులు నానా ఆగచాట్లు పడాల్సి వస్తోంది. చివరకు కూరగాయలు అమ్ముకునేందుకు సైతం సౌలత్ లు లేక తిప్పలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు బజార్​కు మార్కెట్​ను తరలించక, షాపులు కేటాయించక రైతులు ఇబ్బందులు పుడుతున్నారు. ఎస్టేట్​ఆఫీసర్​ను కూడా నియమించడం లేదు. అయిదేళ్లుగా రైతు బజార్​ను వృథాగా  వదిలేశారు. కామారెడ్డి మార్కెట్​యార్డు (గంజు)లో  రైతు బజార్ ​నిర్మాణానికి 2017లో పనులు షూరు చేశారు.   2018, మే 31న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దీన్ని​ ప్రారంభించారు.

 సమీప గ్రామాల రైతులు ఇక్కడ కూర్చొని కూరగాయలు అమ్ముకొవచ్చు. అన్ని రకాల వసతులు ఉంటాయి. తైబజార్​ కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రారంభించిన కొన్నాళ్ల తర్వాత మున్సిపల్ ఆఫీసర్లు ప్రతీరోజు ఇక్కడి మార్కెట్​కు వచ్చి కూరగాయలు అమ్ముకునే  రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. 150కి పైగా అర్జీలు వచ్చాయి. ఏళ్లు గడుస్తున్నా రైతులను గుర్తించడం, షాపులు కేటాయించకపోవడం, ఎస్టేట్​ఆఫీసర్ ​నియమించే ప్రక్రియ ముందుకు పడడం లేదు.   

డెయిలీ మార్కెట్​లో వసతులు లేక..

కామారెడ్డి టౌన్​లో లక్ష జనాభా ఉంది. ఇక్కడి వారితో పాటు, చుట్టు పక్కల ఏరియాల నుంచి కూడా కూరగాయలు కొనేందుకు అధిక సంఖ్యలో టౌన్​కు వస్తారు. కామారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, తాడ్వాయి, సదాశివనగర్​ మండలాలకు చెందిన  రైతులు ఇక్కడికి కూరగాయలు తెచ్చి అమ్ముతారు. తిలక్​రోడ్​లో డెయిలీ మార్కెట్​లో, కొత్త బస్టాండ్​సమీపంలోని సీఎస్ఐ గ్రౌండ్​లో కూర్చొని విక్రయిస్తారు. డెయిలీ మార్కెట్ చాలా చిన్నగా ఉంది. రెండు షెడ్లు ఉంటే, ఒక దాంట్లో గ్యాస్​ఉత్పత్తి సెంటర్, మరో దాంట్లో వ్యాపారులు తిష్ట వేశారు. రైతులు రోడ్లపై, షాపుల ముందు కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్నారు. కొత్త బస్టాండ్​ వద్ద ఎండలోనే  కూర్చోవాల్సి వస్తోంది.

డెయిలీ మార్కెట్​ ఇరుకుగా ఉండడంతో అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్​ ప్రాబ్లమ్స్​ దృష్ట్యా 3 ఏళ్ల కింద గంజు ఆవరణలోకి కూరగాయల మార్కెట్​షిఫ్ట్ ​చేశారు. 2 నెలల తర్వాత మళ్లీ తిలక్​రోడ్​లోని డెయిలీ మార్కెట్​కు తరలించారు. డెయిలీ మార్కెట్​ఏరియాలో ఉన్న కొందరి కోసమే ఇక్కడికి షిఫ్ట్​ చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధిక వసూళ్లు

కామారెడ్డి మార్కెట్​లో తైబజార్​ నిర్ధేశించిన రేట్ల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు.  గంపకు రూ.5 తీసుకోవాల్సి ఉండగా రూ.10 నుంచి రూ.20 వరకు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై మున్సిపల్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుబజార్​లో షాపులు కేటాయించి, అమ్ముకునే వసతి కల్పిస్తే  తైబజార్ ​చెల్లించాల్సిన అవసరం ఉండదు.