స్పెషల్ ​ఆఫీసర్​ మీదే ఆశలు

స్పెషల్ ​ఆఫీసర్​ మీదే ఆశలు
  • సమస్యల మీద ఫోకస్​ పెట్టే చాన్స్​
  • అధ్వాన్నంగా రోడ్లు, డ్రైనేజీలు 
  • శానిటేషన్​ కూడా అస్తవ్యస్తం

కామారెడ్డి​, వెలుగు : మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు స్పెషల్​ ఆఫీసర్​గా లోకల్​బాడీస్​ అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం అపాయింట్​ చేసింది. గతంలో ఎన్నికయిన పాలకవర్గాల హయాంలో పట్టణాల్లో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. మౌలిక వసతులు సరిగా లేక ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. మున్సిపాలిటీలకు తిరిగి ఎన్నికలు జరిగేవరకు స్పెషల్​ పాలన కొనసాగునుంది. జిల్లా ఉన్నతాధికారే స్పెషల్​ ఆఫీసర్​గా ఉండడంవల్ల పట్టణాల రూపురేఖలు మారుతాయని స్థానికులు భావిస్తున్నారు. 

 మధ్యలోనే ఆగిన మార్కెట్​ నిర్మాణం

కామారెడ్డి పట్టణ జనాభా లక్ష వరకు ఉంది. వారి అవసరాలకు తగ్గట్టు పట్టణంలో వసతులు లేవు. మెయిన్​ రోడ్లు , చౌరస్తాలు ఇరుకుగా ఉన్నాయి. పార్కులు, కూరగాయల మార్కెట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. శానిటేషన్​ అంతంత మాత్రమే. టౌన్​లో సిరిసిల్లా రోడ్డులో రాజీవ్ పార్కు, స్నేహపూరి కాలనీ పార్కు, విద్యానగర్​లో రోటరీ పార్కు ఉన్నాయి. ఇవి పట్టణ జనాభా అవసరాలకు సరిపోవట్లేదు. రాజీవ్​పార్కు అంతా చెత్తచెదారంతో నిండిపోవడంతో జనాలెవరూ రావడంలేదు.

 కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​స్వయంగా పార్క్​ను పరిశీలించి, డెవలప్​చేయాలని ఆదేశించినా పరిస్థితి మారలేదు. తిలక్​రోడ్డులో ఉన్న డెయిలీ మార్కెట్​ దశాబ్ధాల కిందట ఏర్పాటు చేశారు. ఇక్కడ షాపులన్నీ వ్యాపారుల చేతుల్లో ఉండడంతో గ్రామాల నుంచి కూరగాయల తీసుకొచ్చే రైతులు కూర్చోవటానికి ఇక్కడ స్థలం లేదు. వారు రోడ్ల మీదే కూరగాయలు అమ్ముకోవాల్సివస్తోంది. గంజులో రూ. 4 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ కాంప్లెక్స్​ నిర్మాణం ఫండ్స్​ లేక మధ్యలోనే అగిపోయింది. రూ.50 లక్షలతో నిర్మించిన రైతుబజార్​ వృధాగానే ఉంది. కామారెడ్డి టౌన్​లోని ఈ సమస్యలకు స్పెషల్​ ఆఫీసర్​ ముగింపు పలుకుతారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 

 ఇరుకు రోడ్లు.. అస్తవ్యస్తంగా డ్రైనేజీలు

కామారెడ్డి టౌన్​లో రోడ్ల వెడల్పు, మెయిన్​ రోడ్లలో డ్రైనేజీల నిర్మాణంపై స్పెషల్​ ఆఫీసర్​ ఫోకస్​ పెట్టాల్సిఉంది. వార్డుల్లోనూ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. నిజాంసాగర్​ రోడ్డు నుంచి పెద్ద చెరువు వైపు వెళ్లే మార్గంలో వానకాలంలో వరద వల్ల రోడ్డు కొట్టుకుపోయి పెద్ద గుంత పడింది. నెలలు గడుస్తున్నా రిపేర్లు చేయలేదు.

 చౌరస్తా నుంచి సిరిసిల్లారోడ్డు, స్టేషన్​ రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ లేక వాన పడితే నీళ్లన్నీ రోడ్లపైనే నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. జంక్షన్లను వెడల్పు చేయకపోవటంతో ట్రాఫిక్​కు అంతరాయం కలుగుతోంది. కొత్త బస్టాండు, నిజాంసాగర్​ చౌరస్తా, ఇందిరా చౌక్​, రామారెడ్డి రోడ్డు, జేపీఎన్​ , సుభాష్​ రోడ్డు చౌరస్తాలను అభివృద్ధి చేయాలి. శానిటేషన్​, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ గాడి తప్పింది.