కేసీ వేణుగోపాల్తో కమ్మనేతల భేటీ.. 10 నుంచి 12 సీట్లు కేటాయించాలని డిమాండ్​ 

కేసీ వేణుగోపాల్తో కమ్మనేతల భేటీ.. 10 నుంచి 12 సీట్లు కేటాయించాలని డిమాండ్​ 

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ల ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. అభ్యర్థుల జాబితాపై స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన జాబితా ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వరకు చేరింది. అయినా.. ఇంకా టికెట్ల పంచాయతీ కొలిక్కి రాకపోగా రోజుకో కొత్త డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిగా మారుతోంది. ఓ వైపు తమకు తగినన్ని టికెట్లు ఇవ్వాల్సిందే అని బీసీ నేతలు పట్టుబడుతున్న వేళ.. కమ్మ నేతలూ తమకు 10 నుంచి 12 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. శుక్రవారం (అక్టోబర్​ 6న) రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మ నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. 

తమ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదన్న ఉద్దేశంతో కమ్మ వేదిక తరపున తమ వినతిని కాంగ్రెస్​ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. చాలా ఓపికగా తమ ఆవేదనను విన్నారని చెప్పారు. ఆయనకు అన్ని సామాజిక వర్గాల గురించి లోతైన అవగాహన ఉందన్నారు. 

సామాజిక వర్గాలకు కేవలం ఓటు అధికారం మాత్రమే కాదు.. వారికి సీట్లు కూడా ఇవ్వాలి కాదా అని ప్రశ్నించారు రేణుకా చౌదరి. పరిశ్రమలు, సినిమా, మీడియా రంగాల్లో ఉన్న కమ్మ వారికి రాజకీయాల్లో కూడా తగిన ప్రాతినిధ్యం ఉండాలన్నారు.