T20 World Cup 2024: కోహ్లీ కంటే మా తమ్ముడి గణాంకాలు గొప్ప: పాక్ క్రికెటర్

T20 World Cup 2024: కోహ్లీ కంటే మా తమ్ముడి గణాంకాలు గొప్ప: పాక్ క్రికెటర్

పాకిస్థాన్ మాజీ కీపర్-బ్యాటర్ కమ్రాన్ అక్మల్ తన సోదరుడు ఉమర్ అక్మల్‌ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లలో  విరాట్ కోహ్లీ కంటే ఉమర్ అక్మల్ మెరుగైన గణాంకాలను కలిగి ఉన్నాడని కమ్రాన్ వింత వాదన చేశాడు. స్ట్రైక్ రేట్, టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు పరంగా కోహ్లీ కంటే ఉమర్ అక్మల్ మెరుగ్గా ఉన్నాడని కమ్రాన్ తన తమ్ముడికి సపోర్ట్ చేశాడు. 

"నేను కోహ్లీ, ఉమర్ అక్మల్ గణాంకాలు చూశాను. విరాట్ కోహ్లీ కంటే ఉమర్ కు మెరుగైన గణాంకాలను ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్‌ స్ట్రైక్ రేట్ కోహ్లీకి 130.52 గా ఉంటే ఉమర్ కు 132 ఉంది. కోహ్లీ వ్యక్తిగత స్కోర్ 89 గా ఉంటే ఉమర్ 94 గా ఉంది. పాకిస్థాన్ జట్టులో ఉమర్ అక్మల్ కొనసాగి ఉంటే కోహ్లీలా తయారయ్యేవాడు". అని కమ్రాన్ అన్నాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 30 వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో 67.41 సగటుతో  1,146 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్‌ 130.52 గా ఉంది.

2022 వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్..2024 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు అర్హత సాధించడం నల్లేరు మీద నడక అనుకున్నారు. అయితే వారంలో ఇదంతా రివర్స్ అయింది. పసికూన జట్లపై విజయాలు సాధించలేక తొలి రౌండ్ ను దాటలేక ఇంటిదారి పట్టింది. శుక్రవారం(జూన్ 14) ఆతిథ్య జట్టు అమెరికా, ఐర్లాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.