భక్తి ప్రవత్తులతో కూడారై ఉత్సవం

భద్రాచలం, వెలుగు :  ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా 27వ రోజైన శనివారం భద్రాద్రి రామాలయంలో కూడారై ఉత్సవాన్ని భక్తిప్రవత్తులతో నిర్వహించారు. రామాలయ ప్రాంగణంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తిరుప్పావై, తిరుపళ్లేచ్చి అను ద్రవిడ ప్రబంధాలను నివేదన సమయంలో అనుసంధానం చేశారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుడితో తన వివాహం జరిగితే 108 గంగాళాలతో పాయసాన్నం నివేదన చేస్తానని సుందర బాహుస్వామికి మొక్కుకుంటుంది. ఈ సమంయలో అమ్మవారితో శ్రీరంగనాథుని వివాహం జరగడం, ఆయనలో ఐక్యం అవడం జరిగింది.

ఈ నేపథ్యంలో ప్రతిఏటా ధనుర్మాస మహోత్సవం  రామాలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్​, రామస్వరూపాచార్యులు పాల్గొన్నారు. కాగా అధ్యయనోత్సవాల్లో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం పగల్​పత్​ ఉత్సవాలు ముగియడంతో ఆలయంలో నిత్య కల్యాణాలు తిరిగి శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. సాయంత్రం గోదాదేవి అమ్మవారికి తిరువీధి సేవ జరిగింది. రాపత్​ ఉత్సవాల్లో భాగంగా అంబసత్రంలో స్వామికి సేవ నిర్వహించారు. 

చండ్రుగొండ : చండ్రుగొండ లో ని వేణుగోపాలస్వామి ఆలయంలో కుడారై ఉత్సవాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.  108 గిన్నెలలో ప్రసాదాలను పెట్టి శంఖు, చక్ర, నామాలు గా ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం గా సమర్పించారు.