- పేమెంట్లు, ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల నిర్ధారణ
- బాధితుడు ఏడాది కిందే ఉద్యోగం మానేశాడంటున్న సంస్థ చైర్మన్
వరంగల్, వెలుగు: హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఓ చిట్‍ఫండ్ సంస్థ డైరెక్టర్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలు, చిట్‍ఫండ్ పేమెంట్లే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే మృతిచెందిన డైరెక్టర్ ఏడాది కిందే ఉద్యోగం మానేశాడని సంస్థ చైర్మన్ చెప్తుండడం గమనార్హం. నల్ల భాస్కర్‍రెడ్డి కొన్నేండ్లుగా వరంగల్లోని కనకదుర్గ చిట్‍ఫండ్ సంస్థలో డైరెక్టర్‍గా పనిచేస్తున్నాడు. అవసరం మేరకు అప్పుడప్పుడు హరిత హోటల్‍లో రూమ్ తీసుకుని ఉండేవాడు. ఈ క్రమంలో ఒక్క రోజుకు గది కావాలంటూ శుక్రవారం హోటల్ లో దిగాడు. గడువు ముగియడంతో మరో రోజు ఉండేందుకు శనివారం రెన్యూవల్ చేసుకున్నాడు.
ఆదివారం ఉదయం నుంచి ఇంట్లోవాళ్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆదివారం మధ్యాహ్నం రూమ్ చెక్అవుట్ గడువు ముగిసిన సమాచారం ఇచ్చేందుకు హోటల్ సిబ్బంది డోర్ కొట్టినా ఓపెన్ చేయలేదు. కొద్ది సేపటికే కుటుంబసభ్యులు హోటల్ వద్దకు రావడంతో అధికారుల పర్మిషన్‍తో సిబ్బంది రూమ్ డోర్ తెరిచారు. అప్పటికే భాస్కర్‍రెడ్డి రూంలోని ఫ్యాన్‍కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని , భాస్కర్‍రెడ్డి హోటల్ రూమ్‌లో చిట్‍ఫండ్ సంస్థ కస్టమర్లకు సంబంధించిన పేమెంట్ల రషీదులు, బుక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆర్థిక సమస్యలు, చిట్‍ఫండ్ పేమెంట్లే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. భాస్కర్‍రెడ్డి మృతిపై కనకదుర్గ చిట్‍ఫండ్ చైర్మన్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. భాస్కర్‍రెడ్డి ఏడాది క్రితమే తమ సంస్థ నుంచి తప్పుకున్నాడన్నారు. కావాలనే కొందరు తమ సంస్థ పేరును బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారిన తెలిపారు.