బీజేపీ, బీఆర్ఎస్​వి డైవర్షన్ పాలిటిక్స్ : మల్లురవి

బీజేపీ, బీఆర్ఎస్​వి డైవర్షన్ పాలిటిక్స్ : మల్లురవి
  • కంచ గచ్చిబౌలి అంశం‘టీ కప్పులో సునామీ’: మల్లురవి 
  • సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి వినతి పత్రం ఇచ్చిన ఎంపీ 
  • కేంద్ర మంత్రి, పార్టీ హైకమాండ్​కు లేఖలు 

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెడుతున్న చరిత్రాత్మక పథకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఎంపీ మల్లు రవి విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల పేరుతో మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, లేని జంతువులను ఉన్నట్టుగా చూపారన్నారు.  హెచ్‌‌‌‌సీయూకు భూములు వేరే చోట కేటాయించారని, అసలు ఈ వివాదమే ‘టీకప్పులో సునామీ’ వంటిదన్నారు. 

త్వరలోనే విపక్షాల కుట్రలు ప్రజలకు అర్థమవుతాయని చెప్పారు. శనివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చైర్మన్ చంద్ర ప్రకాశ్ గోయల్ ను కలిసి, భూముల వ్యవహారంలో వాస్తవాలను వివరిస్తూ ఐదు పేజీల లేఖను అందజేశారు. అలాగే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కు కూడా ఈ లేఖలను సమర్పించారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు. ప్రజల్లో సీఎం రేవంత్ రెడ్డి సర్కారుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఫేక్ వీడియోలు, ఫోటోలు పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదన్నారు. 

సన్న బియ్యం స్కీం చరిత్రలో నిలిచిపోతుందని, భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ స్కీంను తొలగించలేవని మల్లు రవి అన్నారు. దీనిపై ప్రభుత్వానికి మంచిపేరు రాకుండా చేసేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సన్న బియ్యం పంపిణీలో కేంద్రం వాటా ఉందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై ఆయన ఫైర్ అయ్యారు. ‘మీరు ఇస్తున్నారని మోదీ సీఎం అని రాయమంటారా?’ అని ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిగా భావించాలన్నారు.