విశ్లేషణ: మార్పులేని మను ధర్మం

ప్రాచీన బ్రాహ్మణ సాహిత్యాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే యావత్‌‌ శూద్ర కులాలను అసమర్థులుగా, దాస్యులుగా ఎలా మార్చారో మనకు అవగతం అవుతుంది. క్రీస్తు పూర్వం 2, క్రీస్తు శకం 4 సంవత్సరాల మధ్య గ్రంథస్తం చేసిన చాలా ప్రభావవంతమైన మనుస్మృతి బ్రాహ్మణీయ వాదానికి నమూనాగా నిలుస్తుంది. ఇది ఒక క్రమపద్ధతిలో శారీరక శ్రమను, ఉత్పాదక ప్రక్రియను చులకన చేసి, అదే సమయంలో ఆధ్యాత్మిక–మేధావులుగా పిలవబడే ద్విజులు, ప్రత్యేకంగా బ్రాహ్మణులు చెప్పిందే వేదంగా మార్చివేసింది.

శూద్రులు, అంటరాని వారితోపాటు పని చేసే ప్రజలందరినీ తమ చెప్పుచేతల్లో ఉంచుకున్న బ్రాహ్మణ వర్గం మొత్తం మానవ మనుగడకు అవసరమైన బలవంతపు చాకిరీ, పశువులను మేపడం వంటి పనులను చేయడానికి మాత్రమే వారిని పరిమితం చేసింది. కానీ వీటి ద్వారా వచ్చిన ఉత్పాదక ఫలాలను ద్విజ (రెండుసార్లు పుట్టి.. జంధ్యం ధరించే వారు) కులాలు అనుభవించేవి. వ్యవసాయ పర్యవేక్షణలో వైశ్యులు పాలుపంచుకున్నారనే ఊహాగానాలు ఉన్నప్పటికీ, బ్రాహ్మణులు, క్షత్రియులు ఉత్పాదక కార్మికులుగా పని చేసినట్లు చరిత్రలో రికార్డు కాలేదు. అర్థశాస్త్రంలో రూపొందించిన కౌటిల్య రాజ్య యంత్రాంగం కూడా రాజ్య శాసనాలతో ఈ దోపిడీ వ్యవస్థకు, పీడిత విధానానికి ఆజ్యం పోసింది.

శూద్రుల శ్రమను దోచుకునేందుకే..

శూద్రులు, మహిళలకు సంస్కృతం నేర్చుకునే హక్కు, వేదాలను చదివి, వల్లించే హక్కు, ఆయుధాలు ధరించే హక్కు, వ్యాపారం చేసే హక్కు లేదని మను శాస్త్రం స్పష్టంగా చెప్పింది. కేవలం బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులకు మాత్రమే వీటికి సంబంధించిన హక్కు ఉందని తెలిపింది. శూద్రులు శ్రమతో కూడిన పనులన్నీ చేయడం ద్వారా ద్విజ వర్ణాలకు సేవ చేయాలని, వారి ఆదేశాలను పాటించాలని మను యుక్తి చెబుతోంది. అప్పుడు ప్రారంభమైన ఈ అన్యాయాన్ని వర్ణ ధర్మంగా ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. బ్రాహణ వాదానికి సంబంధించిన ఆధ్యాత్మిక, మేధోపరమైన ప్రసంగాలు, మతపరమైన గ్రంథాలు, పురాణాల ఆధారంగా నిర్మితమైన వర్ణధర్మ భావజాలాన్ని అమలు చేయడం.. శూద్రుల శ్రమను దోచుకునే ఏకైక ధ్యేయం కలిగిన విద్యగా కనిపిస్తాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే, స్మృతులు, సూత్రాలు, శాస్త్రాలు అలాగే మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలు వర్ణధర్మం ముఖ్య సిద్ధాంతాలను సమర్థించే సృజనాత్మక రచనల్లా మనకు కనిపిస్తాయి. ఇవి ద్విజులకు అధికారాన్ని, గౌరవాన్ని కల్పించి శూద్రులకు జంధ్యాన్ని ధరించే హక్కుని ఇవ్వకుండా వారిని జరిమానాలకు, బాధలకు పరిమితం చేశాయి.

మోసగించే ప్రయత్నాలు..

21వ శతాబ్ధంలో కూడా శూద్రులు వేదాలను చదవడానికి నిరాకరించడం అనేది నేరపూరిత కుట్రగా కనిపిస్తోంది. వేదాలను చదవడం అనేది తమ హక్కుగా బ్రాహ్మణులు మోసపూరితంగా క్లెయిమ్‌‌ చేస్తున్నారు. వివక్ష చూపి, వెలివేయబడిన శూద్రులతో నిర్మితమైన ‘సత్యయుగం’లో విశదీకరించినది ఇదే. వాస్తవానికి బ్రాహ్మణ ఆధిపత్యం, వారి సత్యపాలన, కఠోర వాస్తవాలు ఇప్పటికీ ప్రతి అంశంలోనూ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. చారిత్రక పరివర్తన చెందిన హింసాత్మక ప్రక్రియల ద్వారా ఇది విజయవంతంగా కొనసాగుతోంది. ఆధునిక భారతంలో జరిగే అణచివేత, ప్రత్యేక విధానాలకు సమాంతరంగా ఇది ఎలా కొనసాగుతోందనేది చాలా ముఖ్యం. ఇప్పటికీ సంస్కృతం, వేదాలను కీర్తించే పనిలో చాలా మంది ఉండగా, ద్విజులు మాత్రం తమ సత్య పాలనని ఇంగ్లిష్​లోకి అనువదించే పనిలో ఉన్నారు. జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, యాదవులు, మరాఠాలు, నాయర్లు, రెడ్డి, కమ్మ, గౌండర్స్, లింగాయత్‌‌లు వంటి ఆధిపత్య కులాలుగా ముద్ర వేసుకున్న శూద్ర కులాలు ఈ సమకాలీన కాలంలో రెండు వైపులా పదునున్న కత్తి వంటి ఈ సమస్యపై ఇంకా రాజీకి రాలేదు.

రెండు శతాబ్దాల శూద్ర రాజకీయాలు

సావిత్రిబాయి, జ్యోతిబా పూలే ..19వ శతాబ్దపు శూద్ర సంఘ సంస్కరణ దంపతులు. విద్య, కులాంతర వివాహాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, వలసవాద బొంబాయి ప్రావిన్స్‌‌లో ఆధ్యాత్మిక–మతపరమైన నిర్మాణం వంటి అంశాల్లో బహుజన విప్లవాన్ని వీరు ప్రారంభించారు. శూద్రులకు నల్లమందులా పని చేసే మతపరమైన, సామాజిక, రాజకీయ, మేధోపరమైన అంశాల ఆధారంగా అల్లుకున్న బ్రాహ్మణవాదంపై తాత్వికతతో కూడిన వాదాన్ని జ్యోతిబా రగిల్చారు. జస్టిస్‌‌ రనాడే లాంటి నిజమైన సంస్కర్తలకు సహకారం అందిస్తూనే తమను తాము జాతీయవాదులుగా పిలుచుకునే కపటదారులపై పోరాటానికి పూలే ఏ మాత్రం సంకోచించలేదు. ఆ తర్వాత అధ్యయనాలు కపటదారుల జాతీయవాదంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేశాయి. ఒకవైపు కొత్తగా అవతరిస్తున్న పొలిటికల్‌‌ ఆర్డర్‌‌‌‌లో గుత్తాధిపత్యాన్ని చూపిస్తూనే, మరోవైపు సంప్రదాయ కుల, సాంస్కృతిక ఆదేశాలను ఏకకాలంలో ఎలా జత చేస్తున్నారో తెలియజేశాయి.

జ్యోతిబా పూలే, సావిత్రిబాయి కృషి

బ్రిటిష్​ పాలకుల కాలంలో పశ్చిమ భారతదేశంలో అంటరానివారు, శూద్రులకు కాస్త ఉపశమనాన్ని కలిగించినా, చలనాన్ని తెచ్చినప్పటికీ.. ప్రాంతీయ హద్దుల్లో ఉన్న బ్రాహ్మణ సంప్రదాయాలు యావత్‌‌ దేశం విషయంలో మారటానికి, బలపరిచేందుకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. క్రిస్టియన్‌‌ మిషనరీల్లో చదువుకున్న పూలే.. హేతుబద్ధ – పౌరాణిక, వ్యక్తిగత–సామాజిక, ప్రైవేట్‌‌–పబ్లిక్‌‌, లౌకిక–ఆధ్యాత్మిక అకారణ వైరుధ్యాలను విజయవంతంగా తెలియజెప్పిన మేధావి. పూలే పని విధానాన్ని పరిశీలిస్తే ఆయన రాతలు, పనులు రెండూ జ్ఞానం, అధికారం మధ్య విడదీయరాని బంధాన్ని అర్థం చేసుకున్నారని మనకు తెలియజేస్తాయి. బ్రాహ్మణ అధికారం పురాణ పరిజ్ఞానం ద్వారా ఎలా రాయబడిందో, సత్యపాలన ఎదగడానికి అది ఎలా దోహదం చేసిందో ఫూలే అర్థం చేసుకున్నారు. అన్ని కులాల మహిళలను విద్యావంతులుగా చేయడంలో సావిత్రిబాయి మార్గదర్శకురాలిగా మారారు. అది బ్రాహ్మణ జ్ఞానానికి శాపమయ్యింది. పూలే అసలైన సత్యశోధక్‌‌ను ప్రారంభించినా కూడా వలసవాదం తర్వాత విద్యావంతుల చర్యలతో అవి కనుమరుగయ్యాయి.

కుల వ్యతిరేక ఉద్యమాలు

సదరన్‌‌ మద్రాస్‌‌ ప్రెసిడెన్సీలో 19వ శతాబ్దానికి చెందిన అయోతీ థాస్‌‌ (1845–1914) అనే పెరియార్‌‌‌‌ దళిత మేధావి బ్రాహ్మణ జాతీయవాద ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా కుల రహిత తమిళ కోసం పోరాడారు. విస్తృతంగా చెప్పాలంటే ద్రవిడ భావజాల రాజకీయాలు, గుర్తింపు కోసం పునాదులు వేశారు. ద్రవిడ గుర్తింపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతూ ఆ తర్వాత పెరియార్‌‌‌‌ రామస్వామి నాయకర్‌‌‌‌ మద్రాస్‌‌ ప్రావిన్స్‌‌లోని నాన్‌‌–బ్రాహ్మిణ్​ నియోజకవర్గాల్లో అద్భుతాలు చేసి చూపించారు. పెరియార్‌‌‌‌ బలమైన హేతువాదిగా, నాస్తికుడిగా సనాతన విశ్వాసాలను చెదరగొట్టడానికి మతపరమైన పురాణాలపై, కుల రహిత సమతావాద స్పృహని పెంపొందించడానికి పోరాడారు. ఉదాహరణకు ఆయన రాసిన ‘సచ్చి రామాయాణ్’(వాస్తవ రామాయణం) ఆర్యన్‌‌ ఆధిపత్య వాదాల్ని ఇప్పటికీ సవాలు చేస్తూనే ఉంది. అర్ధ శతాబ్దం తర్వాత కూడా పెరియార్‌‌‌‌ ప్రసంగాలు హిందూత్వ భావాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. పంజాబ్‌‌కు చెందిన సంత్రమ్‌‌ బీఏ లానే బాబా సాహెబ్‌‌ రాసిన కుల నిర్మూలనను అనువదించి, ప్రచురించి ప్రత్యేకతను చాటుకున్నారు పెరియార్. అయితే తమిళం మాట్లాడే ప్రాంతానికే పరిమితం కావడం, ద్రవిడ ఉద్యమం ద్వారా పుట్టి పెరిగిన కుల వ్యతిరేక అవగాహన అనేది దళిత విముక్తికి వచ్చేసరికి పరిమితంగా ఉండటం వల్ల ద్రవిడ భూభాగంలో కుల దురాగతాలు పెరిగి పెరియార్‌‌‌‌ ఉద్యమం బలహీన పడింది. తమ కంటే పైనున్న ద్విజుల వలన, ఇంకా అసమానతలు, కుల అణచివేతకు గురవుతున్న శూద్ర సమాజం వల్లే ఇలా జరిగింది.

ఇప్పటికీ కొనసాగుతున్న ఆధిపత్యం

పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో స్వాతంత్య్రానికి ముందు బ్రాహ్మణవాద గుత్తాధిపత్యంపై ఒక బలమైన ఉద్యమం జరిగింది. దీనికి ఉత్తరాదిలో హిందీ మాట్లాడేవారు, తూర్పు భారతంలోనూ విస్తృత మద్దతు లభించింది. బహుజన్‌‌ సమాజ్‌‌ పార్టీ, సమాజ్‌‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్​ (యునైటెడ్‌‌) వచ్చే వరకు కూడా ద్విజుల ఆధిపత్యం అక్కడ పెద్దగా చెదరలేదు. ఇక పశ్చిమ బెంగాల్‌‌, ఒరిస్సాలో ఇప్పటికీ వారి ఆధిపత్యం అలానే కొనసాగుతోంది. కానీ, ఒక ముఖ్యమైన వైరుధ్యం ఏమిటంటే, దక్షిణాదిలో పుట్టిన ఉద్యమాలు, నాయకులు బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా శక్తి మేరకు విముక్తి కలిగించే దృష్టితో కార్యాచరణ చేయగలిగారు. అయితే, ఉత్తర, తూర్పు సామాజిక ఉద్యమాలు సంస్కృతీకరణ విధానాల పరిధిలో ముందుకు పోవడానికే మొగ్గు చూపాయి. చివరికి రాజకీయ ఉద్యమాలు కూడా, బ్రాహ్మణీయ హిందూత్వంపై ఆలోచించి, సంస్థాగత సవాళ్లు విసిరేలా కాకుండా వెనుకబడిన వర్గాలను పైకి తీసుకొచ్చి వారికి అధికారం ఇచ్చేలానే ముందుకు సాగాయి.
– ప్రొఫెసర్​ కంచ ఐలయ్య షెపర్డ్, సిద్ధాంతవేత్త, సామాజిక కార్యకర్త