- అల్లు అర్జున్‌తో ప్రచారం చేయించేందుకు కంచర్ల ప్లాన్
- పార్టీ కార్యాలయం, ఫంక్షన్ హాల్ ప్రారంభం
- 10 వేల మందికి భోజన ఏర్పాట్లు, మహిళలకు చీరల పంపిణీ
నల్గొండ, వెలుగు : వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్టికెట్ఆశిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కంచర్ల ఫౌండేషన్పేరుతో వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్న ఆయన ఈ నెల 19 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఇందులోభాగంగానే ఆయన అల్లుడైన ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్రంగంలోకి దింపుతున్నారు. ఈ మేరకు పెద్దవూర సమీపంలోని ముసలమ్మ చెట్టు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. లండన్ పర్యటనలో ఉన్న అర్జున్ గురువారం హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఎన్నికల కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్మించిన పార్టీ ఆఫీస్, ఫంక్షన్‌హాల్‌ను ఈ నెల 19 ప్రారంభించనున్నారు. అనంతరం దాదాపు పది వేల మందితో సభ నిర్వహించనున్నారు. పార్టీ కార్యకర్తలు, అల్లు అర్జున్అభిమానులకు అక్కడే భోజన ఏర్పాట్లతో పాటు, చంద్రశేఖర్ రెడ్డి భార్య అరుణ చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లతో చర్చలు...
రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న చంద్రశేఖర్ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో ఆయనకు ఉన్న పాత పరిచయాలను ఈ ఎన్నికల్లో ఉపయోగించుకోవాల ని చూస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్లో అసంతృప్తులు, ఒకప్పటి సీనియర్ లీడర్లతో మంతనాలు జరుపుతున్నారు. నిడమనూరు, పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో కంచర్లకు సామాజికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా సత్సబంధాలు ఉన్నాయి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్‌ను కాదని కంచర్లకు టికెట్ వస్తదా అని పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఇదే పార్టీ నుంచి మన్నెం రంజిత్ యాదవ్ కూడా రేసులో ఉన్నారు.
2014లో ఇబ్రహీంపట్నం నుంచి ఓటమి..
పెద్దవూర మండలం చింతపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో అల్లు అర్జున్ప్రచారం చేసినా.. చివరి నిమిషంలో టికెట్ రావడం, పైగా చంద్రశేఖర్‌రెడ్డి నాన్ లోకల్కావడంతో ఫలితం దక్కలేదు. అంతకుముందు కాంగ్రెస్‌లో జానారెడ్డి వెన్నెంటే ఉన్న కంచర్ల మిర్యాలగూడ టికెట్ఆశించారు. కానీ భాస్కర్‌రావుకు టికెట్ ఇవ్వడంతో చాన్స్ మిస్ అయ్యింది. ఆ తర్వాత నల్గొండ ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నా బీఆర్ఎస్ వేంరెడ్డి నర్సింహారెడ్డిని తెరపైకి తేవడంతో అక్కడ కూడా ప్రయత్నాలు ఫలించలేదు. చివరి ప్రయత్నంగా ఈ ఎన్నికల్లో సాగర్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. దీనికోసం ఇప్పటికే కేటీఆర్‌ను పలు సందర్భాల్లో కలిసి తన మనసులో మాట చెప్పారు. అయితే ఆయన నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పటికైతే పార్టీతో సంబంధం లేకుండా మామ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి అర్జున్అంగీకరించారు.