- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ నియోజకవర్గంలో రూ. 1300 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులు కొనసాగాలంటే తనను మళ్లీ గెలిపించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. మంగళవారం నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. నివేదన సభను సక్సెస్ చేసిన పార్టీ శ్రేణులకు, జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ హబ్‌తో పాటు రూ. 913 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నల్గొండను దత్తత తీసుకొని బంగారు కొండగా మారుస్తున్నారని చెప్పారు. భవిష్యత్‌లో ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నల్ రోడ్స్ పూర్తి చేస్తామని, తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి గడపకు చేరుస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీలో ఓర్వడం లేదని విమర్శించారు. ఇందులో భాగంగా కేంద్రం నిధులు ఇవ్వడ లేదని ఆరోపించారు. అనంతరం 363 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు గోగుల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, సమీ, లోడంగి గోవర్ధన్, రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.