కాళేశ్వరం ఓ బ్లండర్.. డీపీఆర్ లేకుండానే మూడు బ్యారేజీలు: కంచర్ల రఘు

  •     తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉంటే 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు వచ్చేది
  •     మేడిగడ్డ బ్యారేజీతో కొత్త ఆయకట్టు లేకపోగా.. బ్యాక్ వాటర్​తో వేల ఎకరాలు మునుగుతున్నయ్​
  •     రూల్స్​కు విరుద్ధంగా నిర్మాణ సంస్థకు అదనపు చెల్లింపులు
  •     ఫ్లడ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో పంప్​హౌస్​లు కట్టారు
  •     కమిషన్ ముందు ప్రెజెంటేషన్

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం అశాస్త్రీయమని, డీపీఆర్​లు లేకుండానే వాటిని కట్టారని విద్యుత్ జేఏసీ మాజీ చైర్మన్ కంచర్ల రఘు అన్నారు. ఈ ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ బ్లండర్ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ జుడీషియల్ కమిషన్ ముందు సోమవారం ఆయన హాజరయ్యారు. తర్వాత రఘు మీడియాతో మాట్లాడారు. జుడీషియల్ కమిషన్ ముందు మూడు బ్యారేజీలు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు, కాళేశ్వరం పంప్​హౌస్​లు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చానని తెలిపారు. వాటర్ ఇన్​టేక్​ను తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం, బ్యారేజీల టెండర్లు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, పంప్​హౌస్​ల నిర్మాణంలో లోపాలను చెప్పానన్నారు. ‘‘రీఇంజనీరింగ్ పేరిట తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డకు మార్చింది. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని చెప్పింది. మేడిగడ్డ వద్ద భారీ లభ్యత ఉందని చెప్పి అక్కడ ప్రాజెక్టు కట్టింది. కానీ, అది అబద్ధం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత ఎంత ఉంది? మేడిగడ్డ దగ్గర ఎంత ఉంది? అన్న వివరాలను ఆధారాలతో సహా కమిషన్​కు చెప్పాను’’ అని ఆయన అన్నారు.

148 మీటర్ల దగ్గర కూడా నీళ్లు తీసుకోవచ్చు..

ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో కాకుండా 148 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు ఎగువనున్న మహారాష్ట్ర ఒప్పుకుందని.. అయితే 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు తీసుకోలేమంటూ గత ప్రభుత్వం సాకులు చెప్పిందని రఘు గుర్తు చేశారు. కానీ, 148 మీటర్ల ఎత్తులో కూడా తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు ఎంత తీసుకోవచ్చో కమిషన్​కు ఆధారాలతో సహా వివరించానన్నారు. ‘‘ప్రాజెక్ట్ సైట్​ను తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బ్యారేజీలు, పంప్​హౌస్​ల నిర్మాణం రూపంలో వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడింది. ఏటా రూ.వందల కోట్ల మెయింటెనెన్స్ ఖర్చు పెరిగింది. తుమ్మడిహెట్టిలో ప్రాజెక్టు కట్టి ఎల్లంపల్లికి నీళ్లను తరలించి ఉంటే అదనంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి ఉండేవాళ్లం. కానీ, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తరలింపులో ఆయకట్టే లేదు. పైగా 2 లక్షల ఎకరాల ఆయకట్టును కోల్పోయాం. అది ఒకెత్తయితే మేడిగడ్డ బ్యాక్ వాటర్​తో ఏటా వేల ఎకరాలు మునుగుతున్నాయి. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం అశాస్త్రీయం’’ అని చెప్పారు. 

మూడు బ్యారేజీల్లోనూ లోపాలే

డిజైన్ ఫ్లడ్​ను అంచనా వేయకుండానే.. డీపీఆర్​లు లేకుండానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని రఘు పేర్కొన్నారు. సుందిళ్ల బ్యారేజీ వద్ద డిజైన్ ఫ్లడ్​ను 65,000 క్యూసెక్కులుగా సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) నిర్ధారించింన్నారు. కానీ, గత సర్కారు మాత్రం 57,000 క్యూసెక్కులకే బ్యారేజీని డిజైన్​ చేసిందన్నారు. ‘‘సీడబ్ల్యూసీ ప్రకారం రివర్ సెక్షన్ స్ట్రైట్​గా ఒకే మాదిరిగా ఉన్న చోటే బ్యారేజీలను కట్టాల్సి ఉంటుంది. కానీ, మేడిగడ్డ దిగువన నది వెడల్పు.. అప్​స్ట్రీమ్ వెడల్పుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. దీంతో వాటర్ డిశ్చార్జ్ చేసినప్పుడు ఫ్లడ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది’’ అని తెలిపారు.

నిధులెందుకు ఎక్కువిచ్చిన్రు..

బ్యారేజీల నిర్మాణంలో కాంట్రాక్ట్ లోపాలూ కనిపిస్తున్నాయని రఘు చెప్పారు. ‘‘ఈపీసీ కాంట్రాక్ట్​లో టెండర్లు పిలిచేటప్పుడు ఏ షరతులుంటాయో.. పనులు పూర్తయ్యేటప్పుడు కూడా అవే షరతులుంటాయి. ఈపీసీ కాంట్రాక్ట్​ ప్రకారం.. పని ఎక్కువైనా తక్కువైనా నిధుల చెల్లింపుల విషయంలో తేడాలుండవ్​. పనులు ఎక్కువ చేసినంత మాత్రాన అదనంగా చెల్లించరు. పనులు తక్కువయ్యాయి కదా అని కోత పెట్టరు. కానీ, మేడిగడ్డ నిర్మాణంలో రూల్స్ ఉల్లంఘించారు. పని పెరిగినప్పుడు నిధులు అదనంగా చెల్లించిన గత ప్రభుత్వం.. చేయాల్సిన దానికన్నా తక్కువ పనికి మాత్రం కాంట్రాక్టర్ కు కోత పెట్టలేదు. ప్రైస్ వేరియేషన్ క్లాజుల్లోనూ లోపాలున్నాయి. టెండర్​లు పిలిచేటప్పుడు ప్రైస్ వేరియేషన్ క్లాజ్ లేదు. కానీ, టెండర్లు అప్పగించేటప్పుడు మాత్రం యాడ్ చేశారు’’ అని రఘు స్పష్టం చేశారు.

మెయింటెనెన్స్​ లేదు

2019లో బ్యారేజీలు ఓపెన్​అయ్యాక మూడేండ్ల పాటు ఆపరేషన్ అండ్​ మెయింటెనెన్స్​ చేయలేదని రఘు చెప్పారు. ఫలితంగా బ్యారేజీలు క్రమేపీ దెబ్బతిని మేడిగడ్డ కుంగిందని, అన్నారం, సుందిళ్లలోనూ లీకేజీలు జరిగాయని చెప్పారు. పంప్​హౌస్ లెవెల్స్​ను ఫ్లడ్ లెవెల్​కు ఎగువన పెట్టాల్సి ఉంటుందని, సర్వీస్ బై లెవెల్ ఆధారంగా పంప్​హౌస్​లను నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. కానీ, సర్వీస్ బై లెవెల్​ను తగ్గించి పంప్​హౌస్​లను కట్టారని, దీంతో 2022 వరదల్లో పంప్​హౌస్​లు మునిగాయని చెప్పారు. ఈ వివరాలన్నింటినీ పవర్​ పాయింట్​ ప్రెజెంటేషన్ ద్వారా కమిషన్​కు వివరించానని, అఫిడవిట్ల రూపంలో సమర్పించాల్సిందిగా జస్టిస్ ఘోష్ చెప్పారని పేర్కొన్నారు. బ్యారేజీల నిర్మాణానికి ఇంజనీర్లకు సరైన సమయమే ఇవ్వలేదని, వేగంగా నిర్మించాలని తొందరపెట్టడం, డిజైన్ ఫ్లడ్​ను పరిగణనలోకి తీసుకోకపోవడం, డిజైన్ లోపాలు వంటి వాటి వల్ల బ్యారేజీలకు నష్టం వాటిల్లిందని చెప్పారు.