వందేండ్ల జ్ఞాపకంగా స్మృతిమందిరం

వందేండ్ల జ్ఞాపకంగా స్మృతిమందిరం
  • కందకుర్తిలో రూ.12 కోట్లతో స్పీడ్​గా పనులు 
  • ఆర్ఎస్​ఎస్​ ఫౌండర్​ హెడ్గేవార్ చిన్నప్పటి ఇంటి స్థలంలో నిర్మాణాలు
  • నేడు హర్యానా గవర్నర్​ దత్తాత్రేయ రాక​ 

నిజామాబాద్, వెలుగు:ఇందూర్​ జిల్లాలోని రెంజల్​ మండలం కందకుర్తి విలేజ్​లో ఆర్​ఎస్​ఎస్​ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ చిన్నప్పుడు గడిపిన ఇంటిని స్మృతి మందిరంగా మార్చే పనులు వేగంగా నడుస్తున్నాయి. సంఘ్​ పరివార్​ ఏర్పడి వందేండ్లు కావస్తున్న నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా భారీ నిర్మాణాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ప్రవేశించే ఈ  చిన్నగ్రామానికి   జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా  సంఘ్​ నిర్ణయాలు తీసుకుంది. హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ ఆదివారం కందకుర్తిని విజిట్​ చేయడానికి వస్తున్నందున కోలాహలమైన వాతావరణం నెలకొంది.  

దసరా రోజున సంఘ్​ ఆవిర్భావం

కేశవ్​ బలిరాం హెడ్గేవార్​ పూర్వీకులు కందకుర్తిలో గడిపారు. ఇక్కడి చారిత్రక రాం మందిరం అర్చకులకు హెడ్గేవార్​ తాత, ముత్తాతలు కులగురువులుగా వ్యవహరించేవారు. ఈ టెంపుల్​ వ్యవహారాలను డాక్టర్​ వృత్తిలో స్థిరపడిన ఆయన తాత నాగ్​పూర్​ నుంచి పర్యవేక్షించేవారు. బళీరాం ఇద్దరు కుమారులలో చిన్నవాడైన హెడ్గేవార్​1889 ఏప్రిల్​1న ఇక్కడే పుట్టి పెరిగి ఉన్నత చదువుల కోసం నాగ్​పూర్​ వెళ్లారు. తాత వారసత్వంగా డాక్టర్​గా శిక్షణ పొంది 'అనుశీలన సమితి' పేరుతో గల ఒక విప్లవ సంస్థతో కొన్నాళ్లు అనుబంధం కొనసాగించారు.

 తరువాత  హిందూజాతిని ఒక వేదికపై తేవడంతో పాటు వారిలో ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తి లక్ష్యంగా నాగ్​పూర్​ కేంద్రంగా 1925లో సరిగ్గా దసరా పండగ రోజు రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) స్థాపించారు.  వంద మందితో మొదలైన సంఘ్ తన భావజాలవ్యాప్తితో ఇప్పుడు కోట్లాది మంది సభ్యులతో దేశ రాజకీయాలను పరోక్షంగా శాసించే స్థాయికి చేరింది. బ్రహ్మచారిగా జీవితం గడిపిన హెడ్గేవార్​ 1940లో మృతి చెందాక ఆయన బాల్యం గడిచిన ఇంటిని సంఘ్​ పరివార్​ స్మృతివనంగా మార్చారు.

 హెడ్గేవార్ విగ్రహంతో పాటు వారి కుటుంబీకుల​ కులదైవమైన చెన్నకేశవనాథ్​ విగ్రహాన్ని, భరతమాత విగ్రహాన్ని అందులో ప్రతిష్టించారు. తరువాత1989 నుంచి శ్రీ కేశవ శిశు సమితి పేరుతో ప్రైమరీ పాఠశాల నడుపుతూ పేద పిల్లలకు విద్యాబుద్ధులు అందిస్తున్నారు.   కంప్యూటర్​ డిజిటల్​ ల్యాబ్​, ఈ-క్లాస్​లు, ఎల్​ఈడీ టీవీ సౌకర్యాన్ని ఇందులో కల్పించారు. శిశు సమితి స్కూల్​లో టీచర్లందరికీ స్పోకెన్​ ఇంగ్లీష్​లో స్పెషల్​ శిక్షణ ఇవ్వడం మరో ప్రత్యేకత.  

ప్రధాని మోడీతో ఓపెనింగ్​

1925లో స్థాపించిన ఆర్​ఎస్​ఎస్​ వందేండ్లు చేరుకుంటున్న సందర్భంగా హెడ్గేవార్​ స్మృతి మందిరాన్ని భారీగా విస్తరించాలని నిర్ణయించిన పరివార్​ రూ.కోట్ల ఖర్చుతో ఏడాది కింద పనులు మొదలుపెట్టింది. మొత్తం పదెకరాల భూమిని సేకరించి కేశవ స్మృతి సెంటర్, స్కూల్, హాస్టల్, భరతమాత టెంపుల్, పేద యువకులు, మహిళలు, రైతులకు ట్రైనింగ్​ ఇచ్చేలా భవనాలు నిర్మించనున్నారు.

 రూ.12 కోట్లతో షురూ చేసిన పనులను ఖర్చుకు వెనుకాడకుండా వచ్చే ఉగాది నాటికి పూర్తి చేసే టార్గెట్​తో ముందుకు వెళ్తున్నారు. హెడ్గేవార్​ను అన్ని తరాలు స్మరించుకునేలా, దేశవ్యాప్త గుర్తింపువచ్చేలా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా దీని ఓపెనింగ్​ చేయించాలని ఇప్పటికే నిర్ణయించారు. 

అద్వానీ, వెంకయ్య నాయుడు సందర్శన

తమ ఆరాధ్యదైవం హెడ్గేవార్​ పుట్టిపెరిగిన కందకుర్తి విలేజ్​ను చూడడానికి 1993లో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ఉప ప్రధాని ఎల్​కే అద్వానీ కలిసి వచ్చారు.  స్మృతిమందిరాన్ని విజిట్​ చేశారు. ప్రకృతిపరంగా కందకుర్తికి మరో విశిష్టత ఉంది. గోదావరి, మంజీరా, హరిద్రా మూడు నదులు ఇక్కడే ఒక చోట కలువడంతో త్రివేణి సంగమంగా పేరు పొందింది.

తెలంగాణలోకి గోదావరి ఎంటర్​ అయ్యేది కందకుర్తి వద్దే. ఏటా శ్రావణమాసంలో గంగమ్మకు హారతి ఇస్తారు. అత్యంత నిష్టతో చేపట్టే ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ ఆదివారం వస్తున్నారు. హెడ్గేవార్​ స్మృతిమందిరం పనులు ఆయన పరిశీలించనున్నందున సంఘ్​ పరివార్​ సందడి చేస్తోంది. 2003, 2015లో జరిగిన  గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు కందకుర్తి వచ్చారు. విలేజ్​ను టూరిజం కింద డెవలప్​ చేయాలనే ప్రతిపాదన  చాలా ఏండ్లుగా ఉంది.