కమీషన్​ తీసుకున్నట్టు నిరూపించే దమ్ముందా? : కందాల ఉపేందర్​రెడ్డి

ఖమ్మం రూరల్​, కూసుమంచి, వెలుగు : పాలేరులో కొంతమంది బందిపోటు దొంగలు తిరుగుతున్నారని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పాలేరు బీఆర్​ఎస్​ అభ్యర్థి, ఎమ్మెల్యే కందాల ఉపేదర్​రెడ్డి అన్నారు. తాను ఏ కాంట్రాక్టర్​ దగ్గర 30శాతం కమీషన్ తీసుకున్నానో దమ్ముంటే నిరూపించాలని సవాల్ ​విసిరారు. శుక్రవారం ఖమ్మం రూరల్​ మండలంలో పల్లెగూడెం, పోలేపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఆయన మాట్లాడారు.

తనపై ఛార్జ్ షీట్ అంటూ పిచ్చి  రాతలు రాస్తున్నారని  మండిపడ్డారు. గతంలో ఒకాయన ఎంపీ, మరోకాయన మంత్రిగా పనిచేసి పల్లెగూడెం, -మంగళగూడెం రోడ్డు వేయించారా అని ప్రశ్నించారు. వీళ్లు చెప్పే మాటలు వినడానికి పాలేరు ప్రజలు అమాయకులు కాదన్నారు. ఎవ్వరు దొంగో, ఎవ్వరు మంచివారో 3న  తేలుతుందన్నారు. గత ఎన్నికల్లో కూడా జంగాల సోదరులు తన వెంటనే ఉన్నారని, ఈ ఎన్నికల్లో కూడా తనవెంటే ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, పాలేరు నియోజకవర్గ ఎన్నిక సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి, బీఆర్ఎస్ నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్​ఎస్​లో చేరికలు 

కూసుమంచి మండలంలో బోడియాతండా జీపీలోని బండమీది తండాకు చెందిన 40 కుటుంబాలు, తిరుమలాయపాలెం మండలంలో కాకరవాయి,చంద్రు తండా, హస్నాబాద్ గ్రామాలకు చెందిన 32 కుటుంబాలు శుక్రవారం కందాల ఉపేందర్​రెడ్డి సమక్షంలో బీఆర్​ఎస్​ లో చేరాయి. కూసుమంచి మండలంలో మల్లాయిగూడెం, హట్యాతండా, రాజుతండాల్లో ఎమ్మెల్యే సతీమణి విజయమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్​ ఇంటూరి శేఖర్, సర్పంచ్​ వెంకట్, ఎంపీటీసీ పాల్గొన్నారు.