- సస్పెండ్ చేసిన డీసీసీ..
- ఆయనకు టికెట్ ఇస్తే తాము పనిచేయలేమంటున్న సీనియర్లు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ కాంగ్రెస్లో కంది శ్రీనివాస్ రెడ్డి కల్లోలం మొదలైంది. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎన్నారై కంది పార్టీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సీనియర్ నేతలతో గొడవలతో వివాదాల్లోకెక్కారు. ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందంటూ.. సీనియర్లను పక్కనపెట్టి ఒంటిరిగానే కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అతడిని డీసీసీ సస్పెండ్ చేసింది. ఒకవేళ కందికి టికెట్ ఇస్తే తామంతా కాంగ్రెస్కు దూరమవుతామంటూ సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో కాంగ్రెస్ బలంగా మారుతున్న సమయంలో ఈ వర్గపోరుతో ఆ పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్టీ టికెట్ కోసం ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే పలువురు అభ్యర్థులు పోటీ పడుతుండగా.. కొత్తగా వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డి పాత్ర ఎలా ఉండబోతోందనే చర్చ జోరుగా సాగుతోంది.
నలుగురిలో ఎవరికో..
ఎడముఖం పెడముఖంగా ఉన్న సాజిద్ ఖాన్, గండ్ర సుజాతతో పాటు తన మేనల్లుడు సంజీవరెడ్డి మధ్య సయోధ్య కుదర్చడంలో దివంగత రామచంద్రా రెడ్డి విజయవంతమయ్యారు. అందరినీ కలుపుకొని ఆదిలాబాద్ నియోజకవర్గంలో విస్తృత సమావేశాలు నిర్వహించారు. పార్టీ ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేద్దామని ఐక్యతా రాగంతో ముందుకెళ్లారు. దీనికి ఆ ముగ్గురు నేతలు సైతం సీఆర్ఆర్ నిర్ణయానికి కట్టుబడి విస్తృత పర్యటనలు చేశారు. ఇప్పటికే ఈ ముగ్గురు టికెట్ఆశిస్తున్న నేపథ్యంలో శ్రీనివాస్ఎంట్రీ వారికి మింగుడు పడటంలేదు. ఆ ముగ్గురూ కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటుండగా.. కంది మాత్రం ఒంటరిగా వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి వర్గంగా తనకే ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయ్యిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్లు ఒకవేళ కందికి టికెట్ ఇస్తే తాము పనిచేయమంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ వ్యవహారం ఆ పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది. సర్వేల ద్వారానే పార్టీ టికెట్ కేటాయిస్తుందని ప్రచారం జరుగుతుండడంతో టికెట్ ఎవరికి రానుందా అనేది హాట్టాపిక్గా మారింది.
వివాదాలతోనే రాజకీయాల్లోకి..
కంది శ్రీనివాస్ రెడ్డి వివాదాలతోనే రాజకీయ అరగేట్రం చేయడం గమనార్హం. ఆర్ఎస్ఎస్ భావాలున్న ఆయన అమెరికా నుంచి రాగానే బీజేపీలో చేరారు. అయితే, మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్లతో పొసగక సొంత వర్గం ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు చేశారు. దీనిపై అధిష్ఠానానం సీరియస్ అవడంతో పార్టీ మారినట్లు సమాచారం. వర్గ విబేధాలతో బీజేపీలో చేరిన ఏడాదిలోనే ఆ పార్టీని వీడి ఈ ఏడాది మే నెలలో కాంగ్రెస్ లో చేరారు. చేరిన మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించడం.. సీనియర్లతో పడకపోవడంతో వారు ఆయన్ను పక్కనపెట్టారు. దివంగత మాజీ మంత్రి రాచంద్రరెడ్డి సైతం కందిపై అప్పట్లో అధిష్ఠానానికి కంప్లైంట్ చేసినట్లు చర్చ జరిగింది. ఇక ఆయన మరణం తర్వాత ఎవరినీ లెక్క చేయకుండా పార్టీ, ఇతర కార్యక్రమాల్లో ఒంటరిగానే పాల్గొంటున్నారు. మూడ్రోజుల క్రితం బీసీ ఐక్యత సభలో అనుచరులు, బౌన్సర్లతో గొడవకు దిగడంతో ఆ పార్టీ సీనియర్లే తీవ్రంగా వ్యతిరేకించారు. సభ వేదిక నుంచే కంది శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రకటించారు. ఓ పక్క కాంగ్రెస్ టికెట్ల జాబితా సిద్ధం చేస్తున్న తరుణంలో కందిపై సీనియర్ల తిరుగుబాటుతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.