NZ vs SA: తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు.. కోహ్లీ, బ్రాడ్ మన్ లను దాటేసిన విలియంసన్

NZ vs SA: తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు.. కోహ్లీ, బ్రాడ్ మన్ లను దాటేసిన విలియంసన్

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ టెస్టు క్రికెట్ లో తన హవా కొనసాగిస్తున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాటర్ ఉన్న ఈ కివీస్ టాప్ బ్యాటర్.. తాజాగా దక్షిణాఫ్రికాపై సెంచరీ బాదేశాడు. 241 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకొని ఆట ముగిసే సమయానికి  15 ఫోర్లతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విలియంసన్ టెస్ట్ కెరీర్ లో ఇది 30 సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో విలియంసన్ టెస్ట్ క్రికెట్ లో వేగంగా 30 సెంచరీలు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా నిలిచాడు. 169 ఇన్నింగ్స్ ల్లో కేన్ ఈ ఘనత సాధించాడు. 

సచిన్ టెండూల్కర్ (159 ఇన్నింగ్స్‌లు), స్టీవ్ స్మిత్ (162 ఇన్నింగ్స్‌లు), మాథ్యూ హేడెన్ (167 ఇన్నింగ్స్‌లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. చివరి 9 ఇన్నింగ్స్ ల్లో విలియంసన్ కు ఇది ఐదో సెంచరీ కావడం గమనార్హం. ప్రస్తుత జెనరేషన్ లో ఫ్యాబ్ ఫోర్ గా కొనసాగుతున్న విలియంసన్ తాజా సెంచరీతో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని దాటేశాడు. కోహ్లీ టెస్టు కెరీర్ లో ఇప్పటివరకు 29 సెంచరీలు చేశాడు. స్టీవ్ స్మిత్ 32, రూట్ 30 సెంచరీలు చేశారు. 

విలియంసన్ తో పాటు రచీన్ రవీంద్ర సెంచరీ చేయడంతో న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. విలియంసన్(112), రచీన్ రవీంద్ర (118) క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 219 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్యాటర్సన్, మోర్కెల్ కు చెరో వికెట్ లభించింది.