రేప్, మర్డర్​నూ సమర్థిస్తారా?:కంగన రనౌత్ 

రేప్, మర్డర్​నూ సమర్థిస్తారా?:కంగన రనౌత్ 
  • తనను కొట్టిన కానిస్టేబుల్​ను పొగడడంపై కంగన ఫైర్
  • ఈర్ష్య, ద్వేషం వదులుకోవాలని సూచన

న్యూఢిల్లీ:చండీగఢ్  ఎయిర్ పోర్టులో తనను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్​ మహిళా కానిస్టేబుల్  కుల్విందర్  కౌర్​ను వివిధ వర్గాల వారు పొగడడంపై యాక్టర్, మండి ఎంపీ కంగనా రనౌత్ మండి పడ్డారు. తనను ఆ మహిళా కానిస్టేబుల్  చెంపదెబ్బ కొట్టడం కరెక్ట్  అయితే.. రేప్, మర్డర్​ను కూడా సమర్థిస్తారా అని ట్విట్టర్ లో కంగనా నిలదీశారు.

‘‘చట్టాలను ఉల్లంఘిస్తూ నేరం చేయాలన్న బలమైన తలంపు ఉన్న నేరస్థుల వైపు మీరు మొగ్గుచూపుతారా? ఒకరి ప్రైవసీ జోన్ లోకి చొరబడి వారి అనుమతి లేకుండా శరీరాలను తాకడం, దాడులు చేయడాన్ని ఒప్పుకుంటారా? అలా అయితే రేప్, మర్డర్ ను కూడా సమర్థించినట్లే. మీరు అలాంటి స్వభావం కలవారైతే మీ మానసిక క్రూర స్వభావాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది” అని కంగన పేర్కొన్నారు.

ఈ మేరకు ఆమె ఓ వీడియో పోస్టు చేశారు. సీఐఎస్ఎఫ్​ మహిళా కానిస్టేబుల్  తనను చెంపదెబ్బ కొట్టిందని, అంతటితో ఊరుకోకుండా దుర్భాషలాడిందని ఆమె చెప్పారు. ఈ వీడియో తర్వాత ఆమె మరో పోస్టు చేశారు. ప్రజలందరూ యోగా, ధ్యానం చేయాలని సూచించారు. లేకపోతే జీవితం చేదుగా, భారంగా అనిపిస్తుం దన్నారు. ఈర్ష్య, ద్వేషాన్ని నింపుకోరాదని, వాటి నుంచి బయటకు రావాలని ఆమె అన్నారు.  

కంగనకు షబానా అజ్మీ అండ

కంగనను చెంపదెబ్బ కొట్టిన మహిళా కానిస్టేబుల్  కుల్విందర్  కౌర్ ను పలు వర్గాల వారు సమర్థిస్తున్న వేళ మండి ఎంపీకి షబానా అజ్మీ అండగా నిలిచారు. కంగన అంటే తనకు గౌరవం ఉందని, ఆమెపై ప్రేమ, అభిమానాన్ని కోల్పోలేదని షబానా ట్వీట్  చేశారు. చెంపదెబ్బను సెలబ్రేట్  చేసుకునే వారితో తాను చేరబోనని ఆమె తెలిపారు. భద్రతా సిబ్బంది చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటే, మనలో ఎవరూ సురక్షితంగా ఉండరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా.. కంగనపై షబానా అజ్మీ భర్త జావెద్  అఖ్తర్  గతంలో పరువునష్టం దావా వేశారు. తనను జావెద్  బెదిరించారని గతంలో కంగన ఆరోపించారు. దీంతో ఆయన కేసు వేశారు. ఈ కేసు కోర్టులో ఇంకా నడుస్తోంది.