ఓటమి తట్టుకోలేకపోతున్న రాజాబాబు

ఓటమి తట్టుకోలేకపోతున్న రాజాబాబు
  • విక్రమాదిత్య సింగ్​పై  ఎంపీ కంగనా రనౌత్​ విమర్శలు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ లోక్​సభ ఎన్నికల్లో తన ఓటమిని ఇంకా అంగీకరించలేకపోతున్నారని నటి, మండి ఎంపీ కంగనా రనౌత్ విమర్శించారు. రాజకీయాల్లో పోటీ ఉంటుంది అయితే అది హద్దులు దాటకూడదని, ఇతరులపై పదేపదే బురదజల్లకూడదు, అసభ్యమైన భాషను ఉపయోగించకూడదు అని ఆమె అన్నారు. ఆదివారం మండిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విక్రమాదిత్య సింగ్, ఆయన తల్లి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్​పై పలు కామెంట్లు చేశారు.

 ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్ కొడుకు, రాంపూర్ ఎస్టేట్ వారసుడు విక్రమాదిత్య సింగ్ లోక్​సభ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. మండి మాజీ ఎంపీ ప్రతిభా సింగ్, ఆమె కుటుంబం 40 ఏండ్లుగా ఈ ప్రాంతాన్ని పాలించినప్పటికీ ఎంపీ నిధుల్లోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కంగనా అన్నారు. ప్రతిభా సింగ్ లోక్​భలో ఒకసారి కూడా ఈ ప్రాంత ప్రజల కోసం మాట్లాడలేదని ఆరోపించారు. ఎంతో వైవిధ్యమైన మండి ప్రాంతానికి అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయని కంగనా చెప్పారు. 

అలాగే ఇది ప్రకృతి వైపరీత్యాలతో కూడిన సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నదని చెప్పారు. భర్మౌర్, పాంగి వంటి మారుమూల ప్రాంతాలలో రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు తగినంతగా లేవన్నారు. రైల్వేలు, విద్యుత్, కమ్యూనికేషన్ వంటి ప్రాథమిక సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతున్నానని తెలిపారు.