థియేటర్లలో డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్న తమిళ సినిమా ‘కంగువ’ ఆస్కార్ బరిలో నిలిచింది. ఉత్తమ సినిమాల విభాగంలో కంగువా పోటీ పడుతుండటం విశేషం. 97వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్లకు అర్హత సాధించిన సినిమాల జాబితాను అకాడమీ సంస్థ తాజాగా(జనవరి 7, 2025) విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళ చిత్రం ‘కంగువ’ కూడా నిలిచింది. మరో రెండు నెలల్లో ఆస్కార్ అవార్డ్స్ ప్రదాన వేడుక అట్టహాసంగా జరగనుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’, ‘సంతోష్’, ‘స్వాతంత్ర్య వీర సావర్కర్’, ‘All We Imagine as Light’ సినిమాలు నిలిచాయి.
కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచింది. కానీ అది షార్ట్ లిస్ట్ మాత్రం అవ్వలేకపోయింది. సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకూ ‘ఆస్కార్’ అవార్డ్ గెలవడం మాత్రమే కాదు ‘ఆస్కార్’ బరిలో నిలవడం కూడా గొప్ప విషయమే. ‘వెయ్యేళ్ల కిందట ఆదిమానవుల టైమ్ నుంచి ఐదు తెగల మధ్య జరిగే పోరాటాన్ని నేపథ్యంగా ఎంచుకుని స్క్రిప్ట్ తయారు చేసిన ‘కంగువ’ దర్శకుడు శివ వెండి తెరపై నిరాశపరిచాడు.
Also Read : నాలుగో భర్తకు కూడా గుడ్ బై చెప్పేసిన హీరోయిన్
నటనపరంగా సూర్యకు నూటికి నూరు మార్కులు పడినప్పటికీ ‘కంగువ’ సినిమా కథ, కథనం ఆకట్టుకోలేకపోయాయి. సూర్య హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘కంగువ’. దిశా పటానీ హీరోయిన్‌గా నటించగా, బాబీడియోల్ విలన్ పాత్ర పోషించాడు. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.
2024 నవంబర్ 14న పాన్ ఇండియా వైడ్‌గా ‘కంగువ’ విడుదలైంది. విపరీతమైన లౌడ్ నెస్ సినిమాలో ఉందని ‘కంగువ’ సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. దేవీశ్రీప్రసాద్ పాటలు, ఆటవిక ప్రాంతాన్ని డీఓపీ చూపించిన విధానం ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాత్రలు మాట్లాడటానికి బదులు బిగ్గరగా అరుస్తున్నాయనే విమర్శలను ‘కంగువ’ మూటగట్టుకుంది. విజువల్స్, సినిమాటోగ్రఫీ వల్ల ‘కంగువ’ సినిమా ‘ఆస్కార్’ నామినేషన్ల బరిలో నిలిచి ఉండొచ్చనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘కంగువ’ సినిమా ‘ఆస్కార్’ షార్ట్ లిస్ట్లో నిలవడంపై కొందరు నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’లో సెటైర్లు పేలుతున్నాయి.