డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువా (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కంగువ రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్బంగా కంగువ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్ లోకి వెళుతుందా అని ప్రశ్న ఎదురవ్వగా.. కచ్చితంగా కంగువ రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "నేను రూ. 2000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను ఆశిస్తున్నాను.. మీరు రూ.1000 కోట్ల మార్క్‌తో ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారు" అని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. తాను చెప్పినట్లుగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసిందనేందుకు సాక్ష్యంగా జీఎస్‌టీ బిల్లులను సైతం సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తాను అంటూ నిర్మాత ప్రకటించారు. ఒక నిర్మాత సినిమాపై నమ్మకంగా ఉండటం కామన్‌గా చూస్తూ ఉంటాం. కానీ ఈ నిర్మాత మాత్రం ఏకంగా రెండు వేల కోట్ల టార్గెట్ తో రాబోతున్నాం అంటూ ప్రకటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.
అయితే, ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే.. ఇప్పటివరకు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ మాత్రం సాధించింది. బాహుబలి 2 సైతం ఈ మార్క్ ను బీట్ చేయాలనుకున్న సాధ్యం అవ్వలేదు. ఇక తాజాగా నిర్మాత కేఈ జ్ఞానవేల్ చేసిన కామెంట్స్ స్టోరీపై ఉన్న విశ్వాసంతో అన్నాడా? లేక ఏదో తన సినిమాను ప్రెమోట్ చేయడం కోసం అన్నాడా? తెలియాలంటే ఇంకో నెలరోజులు ఆగాల్సిందే.