కాంగ్రెస్‌, బీఆర్‌‌ఎస్‌ చేసిందేమీ లేదు: కంకణాల నివేదిత రెడ్డి

హాలియా, వెలుగు:  నాగార్జున సాగర్‌‌కు కాంగ్రెస్‌, బీఆర్‌‌ఎస్‌ చేసిందేమీ లేదని తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని బీజేపీ అభ్యర్థిని కంకణాల నివేదిత రెడ్డి కోరారు.  సోమవారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, బొడ్రాయి బజార్‌‌లో దుర్గామాతకు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్  సాగర్‌‌ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికీ అనేక గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని వాపోయారు.  తనను గెలిపిస్తే సాగర్‌‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై కొంపెల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ చలమల వెంకటరెడ్డి, గుర్రం ప్రభాకర్ రెడ్డి, కత్తి శంకర్​ రెడ్డి, రాయపోలు మురళి పాల్గొన్నారు.