ధర్నా చేస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో మంగళవారం (నవంబర్ 14న) గాయపడ్డ నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కు తరలించారు. శ్రీధర్ రెడ్డి పక్కటెముకలు దెబ్బతిన్నాయని నల్గొండ ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగింది..?
ముందుగా.. నెల్లికల్ లిఫ్ట్ శిలాఫలకం వద్ద కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం (నవంబర్ 14న) బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య నివేదిక కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత నెల్లికల్ క్రాస్ రోడ్డు వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. దీంతో నాగార్జునసాగర్ నుంచి హాలియా రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ ట్రాఫిక్ లో సీఎం కేసీఆర్ సభకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఆ ట్రాఫిక్ లో బీఆర్ఎస్ కార్యకర్తలతో వచ్చే ఆటోని ఆపే క్రమంలో బీజేపీ, అధికార పార్టీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కంకణాల శ్రీధర్ రెడ్డిపైనా కొందరు వ్యక్తులు దాడి చేశారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం కోసం వచ్చిన సీఎం కేసీఆర్.. నెల్లికల్ లిఫ్టుని కుర్చీ వేసుకొని కట్టిస్తానన్న వాగ్దానం నెరవేరలేదని కంకణాల శ్రీధర్ రెడ్డి తమ వర్గీయులతో కలిసి ధర్నా చేపట్టారు. మరోసారి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార కోసం కేసీఆర్ వస్తుండంతో శ్రీధర్ రెడ్డి నెల్లికల్ లిఫ్ట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఉన్న శ్రీధర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు.