టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ  తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరుకున్నారు. గుంటూరులోని తన నివాసం నుండి.. అనుచరులు, అభిమానులతో కలిసి ర్యాలీగా మంగళగిరి టీడీపీ ఆఫీసుకు వెళ్లారు. పసుపు కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు వేలాదిగా టీడీపీ కండువా కప్పుకున్నారు. కన్నా టీడీపీ పార్టీలోకి రావడం శుభపరిణామమని చంద్రబాబు అన్నారు. విద్యార్థి దశ నుంచి కన్నా అంచలంచెలుగా ఎదిగారని.. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు మంత్రిగా సేవలందించారని చంద్రబాబు కొనియాడారు. పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అందుకు కన్నా కట్టుబడి ఉన్నారన్నారు.  రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రగతికి నాంది పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక ఈ నెల 16న కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు.