కన్నడ నటుడు చేతన్ చంద్రపై (Chetan Chandra) ఆదివారం (మే 12న) గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన..కన్నడ ఇండస్ట్రీని కలవరపెడుతుంది. నిన్న (మే 12న) మాతృ దినోత్సవం సందర్బంగా తన తల్లితో కలిసి గుడికి వెళ్లి కారులో వస్తుండగా ఒక గుంపు వెంబడించి కారు అద్దాలు పగలగొట్టి..చేతన్ చంద్రపై దాడి చేశారు.అంతేకాకుండా ఇదేంటని వెళ్లి ప్రశ్నించిన చేతన్ను తీవ్రంగా రక్తం వచ్చేలా గాయపరిచారు.
ఇక ఆ వెంటనే మరో 20 మంది అక్కడికి చేరుకుని ఒంటరిగా ఉన్న చేతన్పై దాడికి దిగి..రక్తం వచ్చేలా చితకబాదారు.ముక్కు పగలగొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు..ఆ దుండగులు మళ్లీ చేతన్ను వెంబండించి కారు దగ్గరకు చేరుకుని పూర్తిగా దాన్ని ధ్వంసం చేశారు. ఆ గ్యాంగ్‌లో ఓ మహిళ కూడా ఉంది.
న్యాయం కావాలి:
బెంగళూరులో జరిగిన ఈ దారుణ ఘటనపై చేతన్ చంద్ర తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ వాపోయారు.."నేను మాతృ దినోత్సవం సందర్భంగా మా అమ్మతో కలిసి ఆలయానికి వెళ్ళాను.ఇంటికి తిరిగి వస్తుండగా,మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి నా కారును వెంబడించి కారుని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. అదేంటని ప్రశ్నించగా, మరో 20 మంది వచ్చి రక్తం వచ్చేలా చావు దెబ్బలు కొట్టారని తెలిపారు. ఎలాంటి కనికరం లేకుండా ఓ గుంపు నాపై దాడి చేయడం ఒక భయంకరమైన చర్య అని..నా కారు పూర్తిగా దెబ్బతిందని వాపోయారు.ఇక పోలీసులు తగిన చర్యలు చేపట్టి న్యాయం చేయాలని చేతన్ కోరారు.
నిందితుడు అరెస్ట్
ఈమేరకు పోలీసులకు దాడి సంఘటనకు సంబంధించి విషయం తెలుసుకుని విచారించగా..ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.ఇటువంటి దారుణ ఘటన కన్నడ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.చేతన్ పై జరిగిన దాడిని పలువురు కన్నడ సినీ ప్రముఖులు ఖండించారు.అలాగే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం చేతన్ చంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా చేతన్ 'సత్యం శివం సుందరం' అనే సీరియల్‌లో నటించాడు. 'ప్రేమిజం', 'రాజధాని', 'జరాసంధ', 'కుంభ రాశి', ప్లస్', 'బజార్'..ఇలా తదితర కన్నడ సినిమాల్లో నటించాడు.