
- రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బయపడిన కీలక విషయం
బెంగళూరు: కన్నడ యాక్టర్ రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో విషయం బయటపడింది. దుబాయ్ లో బంగారం కొనుగోలు చేయడానికి ఆమె హవాలా పద్ధతిలో డబ్బు చెల్లించినట్లు తేలింది. విచారణలో రన్యారావు ఈ విషయం వెల్లడించారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పేర్కొన్నారు. ఆమె బెయిల్ పిటిషన్పై మంగళవారం జరిగిన విచారణలో డీఆర్ఐ అధికారులు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు.
కాగా, రన్యారావు మార్చి 3న దుబాయ్ నుంచి అక్రమంగా 14.8 కిలోల బంగారం తరలిస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో అధికారులకు చిక్కారు. అప్పటి నుంచి కస్టడీలో ఉన్న ఆమె బెయిల్ కోసం రెండుసార్లు అప్పీల్ చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మరో నిందితుడు తరుణ్రాజ్కు రన్యారావు డబ్బులు పంపినట్లు విచారణలో తేలింది.
ఆమె పంపిన హవాలా మనీతో దుబాయ్లో ఇద్దరూ కలసి బంగారం కొనేవారని, దాన్ని బ్యాంకాక్, జెనీవా వంటి దేశాలకు అక్రమంగా తరలించేవారని తెలిసింది. వీళ్లు మొదటినుంచి స్నేహితులని, ఇద్దరూ కలిసి దుబాయ్లో విరా డైమండ్స్ ట్రేడింగ్ అనే కంపెనీని ఏర్పాటు చేశారని అధికారుల విచారణలో వెల్లడైంది. బిజినెస్ పార్ట్నర్లుగా ఉంటూనే అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ చేశారని దర్యాప్తులో
తేలినట్లు డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు.