14 కిలోల బంగారంతో ఎయిర్ పోర్ట్లో దొరికిపోయిన సినీ నటి.. ఆ బంగారం విలువ 12 కోట్లు..!

14 కిలోల బంగారంతో ఎయిర్ పోర్ట్లో దొరికిపోయిన సినీ నటి.. ఆ బంగారం విలువ 12 కోట్లు..!

కన్నడ సినీ నటి రన్య రావును బెంగళూరు ఎయిర్ పోర్ట్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అదుపులోకి తీసుకుంది. బెంగళూరు ఎయిర్ పోర్ట్లో 14.8 కిలోల బంగారం అక్రమంగా తరలిస్తూ ఆమె పట్టుబడింది. దుబాయ్ నుంచి ఆమె ఈ బంగారాన్ని ఇండియాకు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో అధికారులకు దొరికిపోయింది. ఈ బంగారం విలువ సుమారు 12 కోట్లు ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఐపీఎస్ అధికారి రామచంద్రరావు కూతురే ఈ సినీ నటి రన్యా రావు. ఆయన ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో డీజీపీగా విధుల్లో ఉన్నారు. 

దుబాయ్ నుంచి బంగారంతో ఎమిరేట్స్ ఫ్లైట్లో రన్యా రావు బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో దిగింది. ఆమెను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమె 15 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు దుబాయ్ కు వెళ్తూవస్తూ ఉండటంతో అధికారులు ఆమె ట్రిప్పులపై నిఘా పెట్టారు. 

ALSO READ : Dil Raju: హీరోలు, ఆర్టిస్ట్లు సేఫ్.. నిర్మాతకే నష్టం.. దిల్ రాజు కామెంట్స్

ఈ నిఘాలోనే ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ఆమె తన జాకెట్లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేసినట్లు తెలిసింది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ సరసన రన్యా రావు మాణిక్య సినిమాలో నటించింది. ఈ సినిమా 2014లో విడుదలైంది. కొన్నేళ్ల నుంచి సినిమా అవకాశాలు దక్కకపోవడంతో ఈజీ మనీ కోసం గోల్డ్ స్మగ్లింగ్ బాటను ఎంచుకుంది. దుబాయ్, ఇండియా మధ్య గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ను నడిపిస్తుందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.