హైదరాబాద్: గచ్చిబౌలిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బుల్లితెర నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో.. శోభిత మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కర్ణాటకలోని ఆమె స్వస్థలానికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. పోస్టుమార్టం అనంతరం.. శోభిత ఆత్మహత్య చేసుకునే చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. శోభిత మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం చేసిన వైద్యులు నిర్ధారించారు.
కర్నాటకలోని హసన్ జిల్లా సక్లేశ్‌పూర్‌కు చెందిన శోభిత(32) కన్నడలో పాపులర్ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించింది.పెండ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పిన శోభిత.. కొండాపూర్ శ్రీరాంనగర్‌లో తన భర్తతో కలిసి ఉంటోంది.
Also Read : పెళ్లికుమార్తెగా శోభితా ధూళిపాళ్ల
హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో శోభితతో సుధీర్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి 2023 మే 21న వారు పెండ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్‌కు వచ్చి కొండాపూర్ శ్రీరాంనగర్‌లో ఉంటున్నారు. సుధీర్ రెడ్డి హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ జాబ్చేస్తున్నాడు. ఇటీవల తెలుగు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో అవకాశాల కోసం శోభిత ప్రయత్నాలు చేస్తోంది.
నవంబర్ 30న రాత్రి 10 గంటల సమయంలో భర్తతో కలిసి భోజనం చేసిన శోభిత.. తన బెడ్ రూంలోకి వెళ్లి నిద్రపోయింది. మరో బెడ్ రూంలో సుధీర్‌రెడ్డి తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అందులోనే నిద్రపోయాడు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పనిమనిషి వచ్చి శోభిత బెడ్ రూం డోర్కొట్టగా, ఆమె ఓపెన్ చేయలేదు. దీంతో సుధీర్ రెడ్డి డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, శోభిత ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.