
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన చిత్రం ‘కన్నప్ప’. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్, కాజల్, అక్ష య్ కుమార్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో వేగం పెంచిన మేకర్స్...గురువారం ముంబైలో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇందులో శివుడి పాత్రలో నటించిన అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ‘ఈ కథ చాలా శక్తివంతమైనది. ఎంతో లోతైన ఎమోషన్స్ ఉంటాయి. విజువల్ వండర్‌గా ఉండబోతోంది. ఈ ప్రయాణంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నా’ అని అన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘కన్నప్ప’ కేవలం నాకు ఓ ప్రాజెక్ట్.. ఓ సినిమా కాదు.. ఇది నా జీవిత ప్రయాణం. నేను ప్రస్తుతం భారతదేశంలోని అన్ని జ్యోతిర్లింగాలను సందర్శిస్తున్నా.
ఈ కథతో నాకు ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది. భక్తి, దైవిక శక్తితో నిండిన ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యక్తికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. నటి మధుబాల, దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.