రాష్ట అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన 6 గ్యారంటీలను, ఇతర హామీలను పూర్తిస్థాయిలో అమలుచేయడానికి విధి విధానాలను రూపొందించే పనిలో ఉంది. ఈనేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖ స్ఫూర్తిని కాంగ్రెస్సర్కారు దృష్టిలో ఉంచుకోవాలి.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని హామీలకు సంబంధించి నిర్దిష్టంగా చర్చించి కొన్ని నిర్ణయాలు చేశారు. ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా చెల్లింపునకు మార్గదర్శకాల రూప కల్పన కోసం అవసరమైన చర్చలు సాగించి, జులై 15 నాటికి నివేదిక ఇచ్చేందుకుగాను నలుగురు సభ్యులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ప్రకటించారు.
ఈ సంఘంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. ఇదే అంశంపై రైతుల అభిప్రాయాలు తీసుకోవడానికి సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో గ్రామాలలో రైతుల జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తీర్మానాలు చేస్తున్నారు.
అలాగే వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో రైతుల నుంచి రాతపూర్వక అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే రైతు వేదికలను కేంద్రంగా చేసుకుని రైతునేస్తం కార్యక్రమం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో రైతుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఒక దఫా రైతు సంఘాలతో కూడా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల చర్చించారు. ప్రభుత్వం ఈ ప్రక్రియ నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం అభినందనీయం.
కౌలురైతులపై కేసీఆర్ సర్కారు వివక్ష
గత కేసీఆర్ ప్రభుత్వం 2018లో రైతుబంధు విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని తప్పుడు మార్గదర్శకాలు రూపొందించింది. పెట్టుబడి సహాయం పేరుతో వ్యవసాయం చేయని భూములకు కూడా నిధులు పంపిణీ చేసింది. వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. చిన్న, సన్నకారు రైతులకు అందిన సహాయం అతి తక్కువ. పెద్ద రైతులకు అందిన సహాయం చాలా ఎక్కువ. దీనిపై గ్రామీణ రైతు కుటుంబాలలో కూడా తీవ్ర నిరసన వ్యక్తమైంది. రైతు స్వరాజ్య వేదిక అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో 36 శాతం కౌలు రైతులు ఉన్నారు.
అంటే సుమారు 22 లక్షల కుటుంబాలన్నమాట. గత ప్రభుత్వం దొరతనంతో వ్యవహరించి, 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలురైతులను గుర్తించడానికి నిరాకరించింది. రైతుబంధు సాయంగా ఒక్క రూపాయి కూడా కౌలు రైతులకు ఇవ్వలేదు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగకపోవడానికి ఇదొక ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. నిజమైన సాగు భూములకే సహాయాన్ని పరిమితం చేస్తామని కూడా ప్రకటించింది. ఈ రెండూ అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కౌలు రైతులు సంతోషంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ఇప్పడు తాను ఇచ్చిన ఈ హామీని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది.
తెలంగాణలో సాగుకు పూర్వవైభవం
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న కౌలు రైతుల దుస్థితిని రేవంత్ తన లేఖలో వివరంగా రాశారు. ‘సొంత భూమిలేని కౌలు రైతులకు ఏటా కష్టాలు పెరుగుతున్నాయి. కౌలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత పెట్టుబడి కోసం మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి. పంట పండినా, పండక పోయినా కౌలు మాత్రం చెల్లించడం తప్పనిసరి అవడంతోపాటు, గిట్టుబాటు ధర దక్కక కుదేలవుతున్నారు. కౌలు చెల్లించి, అప్పోసప్పో చేసి పెట్టుబడి పెట్టి సాగులోకి దిగినా భవిష్యత్ మీద బెంగ గుండెల మీద కుంపటిలాగ దడ పుట్టిస్తూనే ఉంటోంది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ఆదుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేశాయని’ ఆయన తన లేఖలో విమర్శించి రైతాంగాన్ని ఆదుకోవాలన్న తన బాధ్యతను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై గురుతర బాధ్యత ఉందని, రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవాలని, తెలంగాణలో సాగుకు పూర్వ వైభవం తేవడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉందని ఆయన తన లేఖలో ఒప్పుకున్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగ పరిస్థితులను విశ్లేషించి సాగు చేసే ప్రతి ఒక్కరికి భరోసా కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ కు రూపకల్పన చేసిందని, 2022 మేలో రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించామని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు.
రైతాంగానికి కాంగ్రెస్ అండ
వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం చేస్తామని, ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమిలేని రైతు కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తామని మాట ఇచ్చామని, రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని, మెరుగైన పంటల బీమా పథకాన్ని తెచ్చి, ప్రకృతి విపత్తుల వల్లనో, మరో కారణంగానో పంట నష్టం జరిగితే శరవేగంగా నష్టం అంచనా వేయించి, నష్ట పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చామని’ రేవంత్‌రెడ్డి తన లేఖలో వివరంగా పేర్కొన్నారు.
కౌలురైతు కూడా రైతేనని, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలతో సహా అన్ని పథకాలను వర్తింపజేస్తూ 2011లో కాంగ్రెస్ ప్రభుత్వమే కౌలు రైతుల గుర్తింపు చట్టం చేసిందని రేవంత్ తన లేఖలో గుర్తు చేశారు. తెలంగాణలో రైతు రాజ్య స్థాపనే కాంగ్రెస్ లక్ష్యమని, వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి మాటను అమలు చేసి తీరుతామనీ, రైతులెవ్వరూ ఆధైర్యపడొద్దని’ ఆయన తన లేఖలో ఆనాడు హామీ ఇచ్చారు.
కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ రోజు రేవంత్ రాసిన లేఖ రాష్ట్ర కౌలు రైతులలో ఆత్మవిశ్వాసాన్ని, ఎంతో భరోసాను నింపింది. ప్రస్తుతం కౌలు రైతులు ఆ హామీ అమలు కోసం ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులకు అండగా ఆ రోజు బహిరంగ లేఖ రాసిన రేవంత్ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైతులపాలిట ఆప్తుడిగా ఉన్నారు. కౌలు రైతులకు తాను కల్పించిన భరోసాను సీఎం రేవంత్ నిలబెట్టుకుంటారని ఆశిద్దాం.
రైతన్నలకు రేవంత్ హామీ
అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కౌలు రైతులకు ఒక బహిరంగ లేఖ కూడా రాసి రైతన్నలకు భరోసా కల్పించారు. ప్రభుత్వం, మంత్రివర్గ ఉప సంఘం ఆ లేఖను కూడా దృష్టిలో ఉంచుకుని లేఖ స్ఫూర్తిని అమలు చేయడానికి పూనుకోవాలి. మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి, రాష్ట్ర రైతుల దృష్టికి తీసుకురావడానికి వీలుగా 2023 సెప్టెంబర్ లో రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కౌలు రైతులకు రాసిన లేఖను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
ఆయన తన లేఖలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ... ‘గుంట జాగ లేకపోయినా ఎవుసంపై మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న మీకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కలేదు. ఆరుగాలం కష్టించి సాగుచేస్తున్న రైతుగా పొందాల్సిన ఏ మేలును మీరు పొందలేకపోయారు. పంట రుణాలు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా ఏ సాయం అందక మీరు నరకయాతనను అనుభవిస్తున్నారు. రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే గడుపుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
‘రాష్ట్రంలో 40 శాతం మేర సాగుభూమి కౌలు రైతుల అధీనంలోనే ఉందనీ, అయినా ప్రభుత్వం కౌలు రైతులపై కనికరం చూపడం లేదని ఆయన తన లేఖలో ఆరోపించారు. కౌలు రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడంతో పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించిందని, పంట నష్టపోతే పరిహారం అందడం లేదని, అధిక వడ్డీ భారంతో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారని, అయినా కేసీఆర్ ప్రభుత్వం కౌలు రైతుల అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని’ రేవంత్ తన లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే రైతన్నలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
‑కన్నెగంటి రవి,
రైతు స్వరాజ్య వేదిక