కన్నెపల్లి నుంచి సుంకిశాల దాకా అంతా ఆగమాగం

కన్నెపల్లి నుంచి సుంకిశాల దాకా అంతా ఆగమాగం
  • రికార్డుల కోసం పనులు.. నో క్వాలిటీ.. ఇష్టారీతిగా డిజైన్లు
  • ప్రాజెక్టులకు ఎసరు తెచ్చిన గత బీఆర్​ఎస్​ సర్కార్​ నిర్వాకం
  • మూడేండ్లకే మునిగిన కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​లు
  • కుంగిపోయిన మేడిగడ్డ.. ఇప్పుడు కుప్పకూలిన సుంకిశాల గోడ 
  • లోపాలను ఆఫీసర్లు చెప్పినా ఆలకించని గత సర్కార్​

హైదరాబాద్​, వెలుగు: ప్రపంచ రికార్డుల కోసం వేగంగా, ఆగమాగం పనులు! పత్తా లేని క్వాలిటీ.. అడుగడుగునా నిర్లక్ష్యం.. పర్యవేక్షణపై పట్టింపులేని తనం!  ఫలితం.. లక్షల కోట్ల రూపా యల విలువైన ప్రాజెక్టులు, వాటి బ్యారేజీలు, పంపు హౌస్​లు ఒక్కొక్కటిగా దెబ్బతింటున్నాయి!! కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​లు మునగడం.. మేడిగడ్డ కుంగడం.. తాజాగా సుంకిశాల గోడ కూలిపోవడం వెనుక పనుల్లో ఆత్రం, క్వాలిటీ పాటించకపోవడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇష్టారీతిగా డిజైన్లు మార్చడం.. ప్రాజెక్టు పనులను రెగ్యు లర్​గా పర్యవేక్షించకపోవడం లాంటి గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ తప్పిదాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. కాంట్రాక్టులను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్​ పద్ధతిలో తమకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకోవడం.. తప్పు చేసిన కాంట్రాక్ట్​ సంస్థలపై కనీస చర్యలు తీసుకోకపోవడం వల్ల అవే తప్పులు రిపీట్​అవుతున్నాయని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్​హౌస్​ను నిర్మించిన మేఘా సంస్థనే.. సుంకిశాల నిర్మాణం చేపట్టింది. 

అధికారుల మెడపైనా టార్గెట్​కత్తి 

నాటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రపంచ రికార్డు కోసం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమయంలో కేవలం మూడు రోజుల్లో 25 వేల ఘనపు మీటర్ల కాంక్రీట్​ వర్క్​ చేసింది. అధికారుల మెడపై కత్తిపెట్టి మూడేండ్ల స్వల్ప వ్యవధిలోనే  కాళేశ్వరం రిజర్వాయర్లు, పంప్​హౌస్​ల నిర్మాణాన్ని పూర్తి చేయించింది. తీరా చూస్తే మూడేండ్లు తిరిగే లోపలే పంప్​హౌస్​లు మునిగిపోగా.. నాలుగో ఏడాది మేడిగడ్డ కుంగిపోయింది. ఓవైపు దీనిపై ఎంక్వైరీ కొనసాగుతుండగానే మరోవైపు నాటి బీఆర్ఎస్​హయాంలోనే చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టులోని భారీ పంప్​ హౌస్ ​రిటైనింగ్​ వాల్ తాజాగా​కుప్పకూలింది.

హైదరాబాద్​ సిటీకి తాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో రూ.2,215 కోట్ల అంచనా వ్యయంతో సుంకిశాల వద్ద భారీ పంప్​హౌస్​కు 2022 మే 14న నాటి మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. రెండేండ్లలోనే ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లిస్తామని చెప్పుకొచ్చారు. ఎప్పట్లాగే మేఘా సంస్థకే నామినేషన్​ పద్ధతిలోనే కాంట్రాక్ట్​ అప్పగించారు. మూడోసారీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో 2024 జూన్​ నాటికి సుంకిశాలను రెడీ చేస్తామని ఆయన చెప్పారు. ఆ క్రమంలోనే పనుల వేగవంతం కోసం అధికారులపై నాటి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు.

 నాటి ప్రభుత్వ ఒత్తిళ్లకు అటు ఆఫీసర్లు, ఇటు కాంట్రాక్ట్​ సంస్థ ప్రతినిధులు వేగంగా పనులు చేశారు. ఈ క్రమంలో క్వాలిటీని పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగానే సుంకిశాల రిటైనింగ్​ వాల్​ కూలిపోయిందని ఇంజనీరింగ్​ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి కూలిన ఆ గోడనూ బీఆర్​ఎస్​ హయాంలోనే నిర్మించగా.. ఇప్పటికీ అక్కడ పనులు కొనసాగుతున్నాయి.

బాగుంటే తమ గొప్ప.. దెబ్బతింటే అధికారుల తప్పు..! 

గత ప్రభుత్వంలోని పెద్దలు తమను తమపని చేయనివ్వలేదని పలువురు ఇంజనీర్లు వాపోతున్నారు. తమ రిపోర్టులను, డిజైన్లను పక్కనపెట్టి వారే సొంత నిర్ణయాలు తీసుకున్నందునే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నదని అంటున్నారు. ఇటీవల జస్టిస్​ ఘోష్​కమిషన్​ ముందు పలువురు సీనియర్​ ఇంజినీర్లు ఇదే వాదన వినిపించినట్లు తెలిసింది. కన్నెపల్లి పంప్​హౌస్​ నుంచి మేడిగడ్డ బ్యారేజీ వరకు డిజైన్లలో లోపాలున్నాయని చెప్పినా వినలేదని, రికార్డుల కోసం తక్కువ సమయంలో నిర్మించడం వల్లే మేడిగడ్డ కుంగిందని పేర్కొన్నట్లు సమాచారం.

అసలు కాళేశ్వరం ప్రాజెక్టే ఫీజిబుల్​ కాదని ఓ అధికారి గత ప్రభుత్వ పెద్దలకు ముఖం మీదే చెప్పినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. కొన్నాళ్ల పాటు కాళేశ్వరం పనులను పర్యవేక్షించిన ఆ అధికారి.. తర్వాత తప్పుకున్నారు. మేడిగడ్డ విషయంలోనూ డిజైన్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ కాంట్రాక్ట్​ సంస్థ సీనియర్​ అధికారి.. ఆ సంస్థ నుంచే బయటకురావడం గమనార్హం.

ప్రాజెక్టులు బాగుంటే తమ క్రెడిట్​గా చెప్పుకోవడం, దెబ్బతింటే అధికారులపైకి నెట్టివేయడం అన్న తీరులోనే గత ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి.  తాజాగా సుంకిశాల ప్రాజెక్టు దెబ్బతినగా, ఆ నెపాన్ని కూడా అధికారులకు ఆపాదించేందుకు బీఆర్​ఎస్​ నేతలు ప్రయత్నిస్తున్నారని, నాణ్యత లేకుండా వేగంగా ఇష్టారీతిగా నిర్మాణాలు చేపట్టడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని నీటి రంగ నిపుణులు అంటున్నారు. 

వరుసగా బయటపడ్తున్న లోపాలు.. 

ప్రారంభించిన తొలిఏడాదిలోనే కాళేశ్వరంలో అనేక లోపాలు బయటపడ్డాయి. ప్రపంచ అద్భు తం అని ప్రచారం చేసుకున్న ఈ ప్రాజెక్టులో కీల క పంప్​హౌస్​లు మూడేండ్లలోనే మునిగిపోయాయి. కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​లు నీటము నగడంతో మోటార్లు ఖరాబయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. బీఆర్​ఎస్​ హయాంలో ఈ లోపాలన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతం కాళే శ్వరంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ కొనసాగుతున్నది. ఇప్పటికే ఆఫీసర్లను విచారించిన జస్టిస్​ పినాకి చంద్రఘోష్.. తర్వాత రాజకీయ నేతల ఎంక్వైరీకి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు సుంకిశాల పంప్​ హౌస్​ రిటైనింగ్​వాల్​ కూలిపోవడంతో గత బీఆర్​ఎస్​ సర్కారు చేపట్టిన అన్ని ప్రాజెక్టులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

  •  2019 ఆగస్టులో లక్ష్మీపూర్​ ‌‌పంప్​‌‌హౌస్​‌‌వద్ద ప్రొటెక్షన్‌‌ ‌‌వాల్‌‌ ‌‌దెబ్బతిని నీళ్లు లీకయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌‌ ‌‌3న కన్నెపల్లి పంప్​హౌస్​ ప్రొటెక్షన్‌‌ ‌‌వాల్‌‌ ‌‌దెబ్బతినడంతో  మోటార్లపై నీళ్లు పడి పాడయ్యాయి. ప్రాజెక్ట్‌‌‌‌లోనే కీలకమై న కన్నెపల్లి పంప్‌‌ ‌‌హౌస్​లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 2వ మోటార్‌‌‌‌ను ఆన్‌‌‌‌ చేయగా గేట్‌‌‌‌వాల్వ్‌‌ ‌‌లీకై నీరు ఆకాశం వైపు ఎగజిమ్మింది. ఈ నీళ్లు.. వర్షపు నీటికి తోడై పంపుహౌస్ లోకి వచ్చాయి. మూడో టీఎంసీ ఎత్తిపోతల కోసం జరుపుతున్న పనుల సంద ర్భంగా ప్రొటెక్షన్‌‌ ‌‌వాల్‌‌ ‌‌దెబ్బతినడంతో ఈ ఘటన జరిగింది. వందల కోట్ల నష్టం జరిగిన ట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
  •     2019 అక్టోబర్​ 9న అన్నారం బ్యారేజీ గేట్లు లీకయ్యాయి. నాణ్యతలేని పనుల వల్లే ఇలా జరిగిందని అప్పుడు విమర్శలు వచ్చాయి. 
  •     2020 ఆగస్టు 23న కొద్దిపాటి వర్షాలకే కాళే శ్వరం దగ్గర గ్రావిటీ కెనాల్‌‌ ‌‌లైనింగ్‌‌‌‌ కూలింది. ప్రారంభోత్సవానికి గడువు తక్కువగా ఉండ డంతో స్పీడ్​గా పనులు చేయాలని నాటి సర్కార్​ ఆదేశాలిచ్చింది. దీంతో కాంట్రాక్టర్​ హడావుడిగా పనులు చేయించడం వల్లే ఇలా జరిగిందని ఆఫీసర్లు చెప్పారు.  
  •     2021 జులై 23న కురిసిన భారీ వానలకు అన్నారం పంప్​హౌస్​లోకి వరద వచ్చింది. సుందిళ్ల బ్యారేజీ నుంచి ఇన్‌‌‌‌ఫ్లో ఎక్కువ వచ్చి, జల్లారం వాగు పొంగి అన్నారం పంప్‌‌‌‌ హౌస్​ మోటార్లు నీట మునిగాయి. 
  •     2022 జులై 14న వచ్చిన వరదలకు కన్నెపల్లి పంప్​హౌస్​, అన్నారం పంప్​హౌస్​లు ముని గిపోయాయి. కన్నెపల్లి పంప్​హౌస్​ రిటైనిం గ్​ వాల్​ కూలిపోయి 17 మోటార్లు, విద్యుత్​ సామగ్రి దెబ్బ తిన్నాయి. ఆరు మోటర్లు తుక్కు తుక్కయ్యాయి.  అన్నారం పంప్​హౌస్​లోని 12 మోటార్లు కూడా దెబ్బతిన్నాయి. ​ఎఫ్​ఆర్​ఎల్​ కన్నా తక్కువ ఎత్తులో పంప్​హౌస్​లను నిర్మించడం, నాసిరకం పను ల వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 
  •     2023 అక్టోబర్​ 23న మేడిగడ్డ బ్యారేజీ కుంగి పోయింది. ఏడో బ్లాక్​లో ఉన్న 18,19, 20, 21 పియర్లు కుంగిపోయి ఆ గేట్లూ ధ్వంసమ య్యాయి. ఇక అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లూ లీకులు బయటపడ్డాయి. దీంతో నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు కాళే శ్వరం ప్రాజెక్టులోని ఈ మూడు బ్యారేజీల గేట్లను ఆఫీసర్లు ఖుల్లా పెట్టాల్సి వచ్చింది. 
  •    ఇప్పుడు సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్​ వాల్​ కూడా కుప్పకూలింది.