- వృద్ధులను వంచించిన యూపీ భార్యాభర్తలు
- ఇజ్రాయెల్ టైమ్ మెషీన్ తో సాధ్యమేనని నమ్మబలికిన వైనం
కాన్పూర్: ఇజ్రాయెల్లో తయారైన టైమ్ మెషీన్ తో యవ్వనాన్ని తిరిగి తెస్తామని వృద్ధులను ఓ యువ జంట నమ్మించి రూ.35 కోట్లు కొట్టేసింది. ఆపై ఆ సొమ్ముతో విదేశాలకు పారిపోయింది. ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. రాజీవ్ కుమార్ దూబే, రష్మి దూబే భార్యాభర్తలు. ‘రివైవల్ వరల్డ్’ పేరుతో కాన్పూర్లో వారు ఒక థెరపీ సెంటర్ నడుపుతున్నారు. తమ దగ్గర ఇజ్రాయెల్ లో తయారైన టైమ్ మెషీన్ ఉందని, దాంతో 60 ఏండ్ల వ్యక్తిని 25 ఏండ్ల వ్యక్తిగా మార్చవచ్చని సెంటర్కు వచ్చిన పలువురు వృద్ధులను నమ్మించారు. ‘‘కలుషిత గాలి, వాతావరణం కారణంగా ప్రస్తుతం మనుషులు త్వరగా ముసలివారవుతున్నారు. ఈ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉంది. ఇజ్రాయెల్లో తయారైన టైమ్ మెషీన్ తో ‘ఆక్సిజన్ థెరపీ’ చేసి పోయిన యవ్వనాన్ని వెనక్కి తెస్తాం” అని కస్టమర్లకు చెప్పారు.
10 సెషన్ల థెరపీకి రూ.6 వేలు, మూడేండ్ల సెషన్ కు రూ.90 వేలు అని రేట్లు ఫిక్స్ చేశారు. రేణూ సింగ్ అనే బాధితురాలి నుంచి పలు దఫాలుగా రూ.10.75 లక్షలు వసూలు చేశారు. ఇలా పలువురు వృద్ధ కస్టమర్ల నుంచి రూ.35 కోట్లు వసూలు చేసి పారిపోయారు. మోసపోయామని తెలుసుకున్న బాధితురాలు రేణూ సింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే, నిందితులు విదేశాలకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.