బహుజన రాజ్యాధికారమంటే.. కాన్షీరామ్​ను చదవాలి

అనేక సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరంగా ఉంచబడిన పీడిత జనులను విముక్తి చేయడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన జీవితం చివరి వరకు కృషి చేస్తే, ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరణించేవరకు  పోరాడిన గొప్ప యోధుడు కాన్షీరామ్. పీడిత జనులను పాలకులుగా చూడాలనుకున్న అంబేద్కర్ కలలను నిజం చేసినవాడు కాన్షీరామ్. ఆరు దశాబ్దాల భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పి, ఆధిపత్య కులాల పెత్తనాన్ని నిరోధిస్తూ బహుజన కులాలకు రాజ్యాధికార రుచిని చూపించినవాడు కాన్షీరామ్.

స్పూర్తి పొందిన ఘటనలు

పంజాబ్ రాష్ట్రంలోని రోఫార్ జిల్లా, కావాస్ పూర్ గ్రామంలో 1934 మార్చి 15న జన్మించారు. 1956లో డెహ్రాడూన్ స్టాఫ్ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాస శిక్షణ అనంతరం అక్కడి భారతీయ వైజ్ఞానిక సర్వే విభాగంలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు.1959లో పూణేలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిలటరీ ఎక్స్‌‌‌‌ప్లోజివ్స్ సంస్థలో పరిశోధన అధికారిగా నియమితులయ్యారు. 1963లో దీనాబానా అనే నాల్గవ తరగతి ఉద్యోగిని బర్తరఫ్ చేయడాన్ని కాన్షీరామ్ తీవ్రంగా ప్రతిఘటించి ఆందోళన చేశారు. ఆయన చేసిన చట్టబద్ధ పోరాటం వల్ల ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. అలాంటి అనేక  సంఘటనలు కాన్షీరామ్‌‌‌‌లో పోరాట స్ఫూర్తి నింపాయి.  పీడిత ప్రజలు కులాలుగా, ఉపకులాలుగా విడిపోయి ఉండటం వల్ల రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని, ఈ చిన్నచిన్న సమూహాలను బహుజన సమూహంగా మారిస్తే అధికారం చేజిక్కించుకోవడం సాధ్యమవుతుందని కాన్షీరామ్​ గ్రహించారు.  అందుకోసం ఆయన బ్రహ్మచర్యం పాటించారు. కాన్షీరామ్‌‌‌‌కి పెళ్లి చేయాలని కుటుంబం నిర్ణయిస్తే.. బహుజన సమాజమే తన కుటుంబం అని, అంబేద్కర్ చేపట్టిన మహోన్నత సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే తన జీవిత లక్ష్యమని, తాను చనిపోయినట్లు తన కుటుంబ సభ్యులందరూ భావించాలని 1965లో తల్లిదండ్రులకు ఉత్తరం రాశారు. దళితుల విముక్తే లక్ష్యంగా ఒక భుజాన సంచితో, పాత సైకిల్‌‌‌‌తో కాళ్లకు చెప్పులు లేకుండా ఊరూరా కరపత్రాలు పంచుతూ ఆకలి, దాహం మరచిపోయి అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. 

బీఎస్​పీ ఆవిర్భావం

1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు లక్షలాది ప్రజల ముందు కాన్షీరామ్ పార్టీ పేరు బహుజన సమాజ్ పార్టీ, ఎన్నికల గుర్తు ఏనుగును ప్రకటించారు. ఫూలే ఉద్యమం నుండి బహుజన సమాజ్ పేరును, అంబేద్కర్ ఉద్యమం నుండి నీలి జెండా, ఏనుగు గుర్తును తీసుకున్నట్లు ప్రకటించారు. 1989లో బీఎస్​పీ ఉత్తరప్రదేశ్‌‌‌‌లో రెండు లోక్​సభ  స్థానాలు గెలుపుతో పాటు, 13 అసెంబ్లీ స్థానాలు మొదటిసారి  కైవసం చేసుకుంది.  అప్పటి నుంచి బీఎస్​పీ వెనక్కి తిరిగి చూడలేదు. భారత రాజకీయాల్లో ఒక కీలక జాతీయపార్టీగా ఎదిగింది. అనేక రాష్ట్రాలకు విస్తరించింది.1993 ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బిఎస్‌‌‌‌పి, ఎస్‌‌‌‌పి సంకీర్ణ కూటమి విజయం సాధించి మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మాయావతిని ముఖ్యమంత్రిని సైతం  చేశారు. ఆయన పెంచి పోషించిన బీఎస్​పీ స్వతహాగా కూడా యూపీ లో అధికారంలోకి రాగలిగింది.  ఓటు ఒక పోరాట సాధనం దాన్ని అమ్ముకోవడం తమను తాము అమ్ముకోవడం అవుతుందని, బహుజనులు ఓటును పదునైన ఆయుధంగా వాడి అధికారంలోకి రావాలని, పదవులు ముఖ్యం కాదు బహుజన సమాజ నిర్మాణమే నా కర్తవ్యం అని, రాజ్యాధికారం ద్వారానే బహుజనులకు భద్రత ఉంటుందని కాన్షీరామ్ చెప్పేవారు. అక్టోబర్ 9, 2006న కాన్షీరామ్‌‌‌‌  మరణించారు.  బహుజన రాజ్యాధికారం అంటే కాన్షీరామ్​ను చదవాల్సిందే!

బహుజన ఉద్యమాలు

బోధించు, పోరాడు, సమీకరించు అనే నినాదంతో 1978, డిసెంబర్ 6న ‘బామ్ సెఫ్’ను స్థాపించాడు.  ‘పే బ్యాక్ టు సొసైటీ’ అనే నినాదంతో సమాజానికి విద్యావంతులైన ఉద్యోగులు తమ మేధస్సును, డబ్బును, ప్రతిభను అందించాలని కాన్షీరామ్ కోరారు. కాన్షీరామ్ కోరిక మేరకు ఎంతో మంది ఉద్యోగులు ‘బామ్ సెఫ్’ కార్యక్రమాలలో పాల్గొని సమాజ అభివృద్ధికి కృషి చేశారు. ‘మన టిక్కెట్లు మనమే ఇచ్చుకుందాం మన ఓటు మనమే వేసుకుందాం’ అనే నినాదంతో 1982లో హర్యానా, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కశ్మీర్ ఎన్నికలలో దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి పాల్గొని  నాలుగవ స్థానాన్ని సాధించింది. ఎన్నికలలో బహుజనులు పూర్తిగా మద్దతు తెలిపారు. 
- సంపత్ గడ్డం,
దళిత విద్యార్థి నాయకుడు