యాదగిరిగుట్ట, వెలుగు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు లేదని కాంగ్రెస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్ అన్నారు. పదేండ్లు ఆలేరు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా పని చేసిన సునీత.. సొంత ఊరు వంగపల్లిని అభివృద్ధి చేసుకోలేని అసమర్థురాలని ఎద్దేవా చేశారు. సోమవారం యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంగపల్లిలో బైపాస్ రోడ్డులో ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. అప్పుడు ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోటకొండూర్ చౌరస్తాలో అండర్ పాస్ రోడ్డు మంజూరు చేయించారని గుర్తుచేశారు.
అండర్ పాస్ రోడ్డు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, ఇది మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి జరుగుతుంటే గొంగిడి సునీత ఓర్చుకోలేక పోతున్నారని మండిపడ్డారు. ఇకనైనా గొంగిడి సునీత తన వైఖరి మార్చుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ డైరెక్టర్లు శ్రీశైలం, నర్సింహులు, మాజీ ఉపసర్పంచ్ భరత్ గౌడ్, కౌన్సిలర్ మల్లేశ్ యాదవ్, టౌన్ ప్రెసిడెంట్ భిక్షపతి పాల్గొన్నారు.