సంక్రాంతి అంటే... ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు. మూడు రోజులు ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా చేసుకుంటారు. కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే పండుగ ఇది. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, ఇక మూడో రోజు కనుమ. పంట చేతికి రావడానికి రైతులు అంతాఇంతా కష్టపడరు. ఆ కష్టంలో పశువుల సాయం వెలకట్టలేనిది. యజమాని ఆనందం కోసం అవి ఎంతగానో శ్రమిస్తాయి.వ్యవసాయంలోనే కాకుండా పొడి ద్వారా కూడా గోమాతలు రైతన్నను ఆర్థికంగా ఆదుకుంటాయి. ఇలా తమ సంపదలకూ, సంతోషాలకూ కారణమైన పశువులను కృతజ్ఞతతో పూజించడమే కనుమ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే కనుమ రోజును పశువుల పండుగ అంటారు.
రైతన్నడు ప్రకృతితో విడదీయలేని అనుబంధం ఉంటుంది. మట్టి -నీళ్లూ,చెట్టు చేమ అన్నీ రైతు అభివృద్ధికి సాయం చేస్తాయి. ఆ సాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తాము మాత్రమే కాకుండా.. పశువులతో, పక్షులతో పంచుకుంటారు. పిట్టల కోసం దాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు అవులు, ఎద్దులకు పూజచేస్తారు. అన్నం పెట్టి పొలానికి నైవేద్యం పెడతారు.
అవి కూడా ఫ్యామిలీలో భాగం...
నాగలి కడితే పాలం దున్నుతాయి. బండి కడితే ఎరుపూ, ధాన్యం మోసుకెళ్లాయి. గుంటుక కడితే.. వెంటనేళ్లను చదును చేస్తాయి. ఇలా రైతన్న ఏ పని చెప్తే ఆ పని చేస్తాయి పశువులు. ట్రాక్టర్లు లేని రోజుల్లో పశువుల కొట్టం లేని రైతు ఉండేవాడు కాదు. దీన్ని బట్టి అర్ధం. చేసుకోవచ్చు.. రైతు తీసే పంటలో సగం కష్టం పశువులడే అని! పశువులను కూడా తమ ఫ్యామిలీలో మెంబర్లాగే చూసుకునేంత ప్రేమ చాలా మంది రైతులకు ఉంటుంది. నాలుగు మోపుల గడ్డేసినందుకే వ్యవసాయంలో తన కష్టాన్ని పంచుకొని, అకలి తీరుస్తున్న ఈ పశువులకు థాంక్స్ చెప్పుకోకుంటే ఎలా?
పశువుల పూజ
కనుమ రోజు.. రైతన్నలు ఆవులు, ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో ఆ రోజు ఎలాంటి పనీ చేయించరు. ఉదయమే పశువులను నదీ తీరాలు లేదా చెరుపుల దగ్గరికి తీసుకెళ్లి శుభ్రంగా కడుగుతారు. నుదుట పసుపు, కుంకుమలతో. బోటు పెట్టి.. వాటి మెడలో గలుగలమనే మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు. తర్వాత వాటికి హారతి ఇచ్చి పూజ చేస్తారు. కొత్త ధాన్యంతో వండిన పొంగలి తినిపిస్తారు. కొంత ఆ పొంగలిని తమ పొలాల్లో చల్లుకుంటారు. అలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు.
మినప గారెలు
కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు 'మినుములు' తినాలనే ఆచారం ఉంది. అందుకే 'మినప గారెలు చేసుకొని తింటారు. కనుమ రోజు కాకి కూడా కదలరని సామెత ఇందుకే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అల్లుళ్లు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. అలాగే ముత్తైదువులకు కనుమనాడు పసుపుబొట్టు ఇవ్వడం సంప్రదాయం
మాంసం వండాల్సిందే..
భోగి, సంక్రాంతి రెండు రోజులు తీపి పందుగలైతే కనుమ ముక్కల పండుగ అని అంటారు. సంక్రాంతి పండుగలో.. మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. తెలుగు ప్రజలు కనుమ పండుగను జోరుగా జరుపుకుంటారు. కనుమ రోజు మినుము తినాలి అని చెప్పిన పెద్దలు అందులోకి నాటుకోడి మాంసం ఉండాలంటారు. కేవలం కోడికూరతో ఆగిపోకుండా.. ముగ్గురు నలుగురు కలిసి మేకను కోసుకొని తినడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే కనుమనాడు చికెన్, మటన్ షాపుల ముందు జనాలు బారులు తీరుతారు మన రాష్ట్రంలో కొన్ని చోట్ల సంక్రాంతి రోజే.. మాంసాహారం తినే సంప్రదాయం ఉంది
ద్వాపర యుగం నుంచే..
కనుమ పండుగ ద్వాపర యుగం నుంచే జరుపుకుంటున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. భగవంతుడిగా అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు. అలా గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణమైన గోవర్ధనగిరితో పాటతమ సుఖసంతోషాలకు కారణమైన గోవులకు కనుమ రోజున పూజ చేసేవారు. అప్పట్నుంచి ఇప్పటివరకు సంక్రాంతి మరుసటి రోజున కనుమ పండుగ జరుపుకుంటున్నారని పండితులు చెప్తారు.
=== వెలుగు లైఫ్..