టీమిండియా ఐసీసీ ట్రోఫి నెగ్గి దాదాపు పదేళ్లు అవుతోంది. చివరి సారిగా ధోని నేతృత్వంలో భారత జట్టు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత ఐసీసీ మెగా ఈవెంట్లలో సెమీస్, ఫైనల్ చేరినా కప్పు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సొంత గడ్డపై మెగా వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ క్రమంలో టీమిండియాలో ఎలాంటి ఆటగాళ్లు ఉంటే భారత జట్టు విజేతగా నిలుస్తుందన్న చర్చ మొదలైంది. ఈ చర్చకు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సరైన సమాధానం ఇచ్చాడు.
ఇంకో కపిల్ దేవ్ ఎందుకు..
2023 వరల్డ్ కప్ గెలవాలంటే టీమిండియాకు కపిల్ దేవ్ వంటి ఆటగాడు అవసరం లేదని..స్వయంగా కపిల్ దేవ్ అనడం గమనార్హం. చాలా మంది ప్రస్తుత భారత జట్టులో కపిల్ దేవ్ లేడని..అందుకే టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందో లేదో అని బాధపడుతున్నారని చెప్పారు. అయితే వరల్డ్ కప్ గెలిచేందుకు మరో కపిల్ దేవ్ అవసరం ఎందుకు అని ప్రశ్నించాడు. ఒక్క కపిల్ వరల్డ్ కప్ ఇవ్వలేడని చెప్పాడు.
నా కంటే బెటర్..
వరల్డ్ కప్ గెలవాలంటే మంచి టీమ్ కావాలని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ప్రతీ సారి కపిల్ దేవ్ వచ్చి వరల్డ్ కప్ గెలిపించడని..అయితే తరం మారే కొద్దీ మెరుగైన క్రికెటర్లు బయటపడారని చెప్పారు. కపిల్ దేవ్ కంటే కొత్త క్రికెటర్లు బౌలింగ్, బ్యాటింగుల్లో ఇంకా మెరుగ్గా ఉంటారని తెలిపారు.
సచిన్ కంటే బెటర్ దొరికాడు..
ప్రపంచ క్రికెట్లో బ్రాడ్మన్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ వంటి మేటి ఆటగాళ్లు వచ్చారని..వారే బెస్ట్ క్రికెటర్లు అని అనుకున్నామని కపిల్ దేవ్ అన్నారు. కానీ ఆ తర్వాత వారిని మించిన క్రికెటర్లు వచ్చారని చెప్పుకొచ్చారు. సునీల్ గవాస్కర్ తర్వాత సచిన్..సచిన్ వారసుడిగా కోహ్లీ వచ్చారని..కాబట్టి కొత్త తరం ఎప్పుడూ మరింత మెరుగ్గానే ఉంటుందన్నారు. యువ ఆటగాళ్లపై కొంత ఇన్వెస్ట్ చేసి..వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.