Rohit Sharma: రోహిత్ శర్మ ఏదీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: భారత దిగ్గజ క్రికెటర్ మద్దతు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. 2024 టీ20 వరల్డ్ కప్ భారత్ గెలిచిన తర్వాత రోహిత్ కు ఏదీ కలిసి రావడం లేదు. శ్రీలంకలో వన్డే సిరీస్ ఓడిపోవడం.. ఇటీవలే న్యూజిలాండ్ పై 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో అతని కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా హిట్ మ్యాన్ కెప్టెన్ గా చేసిన అడిలైడ్ టెస్టులో భారత్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో హిట్ మ్యాన్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. కెప్టెన్సీతో పాటు పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ మద్దతుగా నిలిచాడు.

కపిల్ దేవ్ మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతను చాలా సంవత్సరాలుగా భారత జట్టును ముందుండి నడిపించాడు. రోహిత్ సామర్థ్యంపై అనుమానం అనవసరం. అతని ఫామ్ తిరిగి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఒకటి లేదా రెండు ప్రదర్శనలతో మీరు ఒకరి కెప్టెన్సీని అనుమానించినకూడదు. అలా అయితే ఆరు నెలల క్రితం అతను దేశానికి టీ20 ప్రపంచ కప్ ను గెలిపించాడు". అని కపిల్ మంగళవారం ఢిల్లీ గోల్ఫ్ క్లబ్‌లో చెప్పుకొచ్చాడు. 

Also Read :- ఆ రోజు నా పేరు చెప్పలేదు

6 & 5, 23 & 8, 2 & 52, 0 & 8, 18 & 11, 3 &6.. చివరి ఆరు టెస్టుల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పరుగులివి. సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్న హిట్‌మ్యాన్ పరుగుల వేటలో వెనుకబడి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ కుర్ర క్రికెటర్లు సెంచరీల మీద సెంచరీలు చేస్తుంటే.. తాను మాత్రం క్రీజులో నిలబడటానికే నానా అవస్థలు పడుతున్నాడు. కీలక మ్యాచ్‌ల్లోనూ అదే ఆట తీరు. అనవరసపు షాట్లకు పోయి వికెట్ పారేసుకుంటున్నాడు. ఇంత విఫలమవుతున్నా అతను జట్టులో ఉన్నాడంటే అందుకు కారణం.. నాయకుడు అన్న పేరు మాత్రమేనని అభిమానులు అంటున్నారు. 

కష్టాల్లో ఉన్న జట్టును హిట్‌మ్యాన్ తన వికెట్‌తో మరింత కష్టాల్లోకి నెట్టాడు. అభిమానులు దీన్ని పాజిటివ్‌గా తీసుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు హిట్‌మ్యాన్ పేలవ ప్రదర్శనపై నోరు మెదపనప్పటికీ, ఇప్పుడు విమర్శలు ఎక్కు పెడుతున్నారు. తనకు తానుగా జట్టు నుంచి తప్పుకోవాలని రోహిత్‌కు సూచిస్తున్నారు. బ్యాటర్ గా.. కెప్టెన్ గా విఫలం అవుతుండడంతో రోహిత్ పై రిటైర్మెంట్ వార్తలు వస్తున్నాయి.