వలిగొండ, చౌటుప్పల్, యాదాద్రి,వెలుగు : గ్రామ పంచాయితీల్లో అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.167 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఏడాదికి రూ.31 లక్షలు నేరుగా అందిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. రామన్నపేట మండలం వెల్లంకి, చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామాలను సందర్శించి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పల్లె ప్రకృతివనం, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డులను పరిశీలించారు. ప్రతి పేదకుటుంబానికి 2022 నాటికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నది మోడీ ఆశయమని, ఇందుకోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేస్తున్నామని అన్నారు. దేశంలో రోడ్లు నిర్మాణానికి రూ.15 వందల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.70 వేల కోట్లు, శానిటేషన్, డ్రింకింగ్‌వాటర్ కోసం రూ.2036 లక్షల కోట్లు కేటాయించామన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న ఫండ్స్ నేరుగా సర్పంచులకే పంపుతున్నామన్నారు. కాలుష్యాన్ని నివారించడానికి పల్లె ప్రకృతి వనాలు దోహదపడతాయని అన్నారు. 15 ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు 40 శాతం ఫండ్స్ పెరిగినట్టు మంత్రి చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలను పరిశీలిస్తామన్నారు. ఇప్పటివరకు మీ ఊరికి కేంద్రమంత్రి ఎవరైనా వచ్చారా ? అని ప్రజలను ప్రశ్నించగా మీరే ఫస్టని సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్‌డీఓ పీడీ ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, జడ్పిటీసీ పున్న లక్ష్మి, సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, ఎంపిటీసీలు తిమ్మాపురం మహేందర్ రెడ్డి, ఎర్రోళ్ళ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. మంత్రికి బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్‌లో మంత్రిని కలిసిన ఆయన సన్మానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, అధికార ప్రతినిధి పాల్వాయి రజని కుమారి ఉన్నారు.
ప్లకార్డులతో నిరసన
కేంద్రమంత్రి మోరేశ్వర్ పాటిల్ ఎస్.లింగోటం గ్రామానికి వస్తుండగా జైకేసారం దగ్గర సీపీఎం, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. మంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడేందుకు ప్రయత్నించగా, పోలీసులు నివారించారు.