గత శనివారం రోజున సిక్కిం జ్యుడీషియల్ అకాడమీ ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. న్యాయ వ్యవస్థ గురించి, కొత్తగా వచ్చిన క్రిమినల్ లా చట్టాలలోని బాగోగులను తులనాత్మకంగా పరిశీలించడానికి.. నాకున్న అవగాహన మేరకు చెప్పాలంటే చాలా జ్యుడీషియల్ అకాడెమీలు ఇష్టపడవు. కేంద్ర ప్రభుత్వ చట్టాలని విమర్శించడానికి ఇష్టపడవు. వాటికి కారణాలు అనేకం. వాటి జోలికి నేను వెళ్లదల్చు కోలేదు. దాదాపు రెండు మాసాల క్రితం వరకు నేను తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడెమీ డైరక్టర్‌గా పనిచేసిన అనుభవం మీద చెబుతున్న మాటలు ఇవి.
సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ నా కథల పుస్తకం ‘నేనూ.. నా నల్లకోటు’కి ముందు మాటరాస్తూ రచయిత బషేర్వీస్ సింగర్ అన్న మాటలను ఉదహరించారు. అవి ఇలా ఉంటాయి. ‘బలంగా కేంద్రీకృతమైన ఏ వ్యవస్థ తీక్షణమైన స్వతంత్ర భాగాలు ఉన్న వ్యక్తులను సహించదు’ ఈ ముందుమాటని ఆయన 30 జూన్ 2023న రాశారు. ఆయన ఇంకా ఇలా అన్నారు. ‘పైన చెప్పిన విషయం తెలిసి చాలామంది.. అంతా దివ్యంగా ఉంది అని చెబుతారు. కానీ, వారిలో ఎక్కువ భాగం నాలుగు గోడల మధ్య వ్యవస్థలను గురించి గొప్ప విశ్లేషణ చేస్తారు. విమర్శిస్తారు. అయితే, పదిమందిలో ఆ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పరు. భయాలు, ఆశలు..కపిల్ సిబాల్ ప్రసంగం విన్న తరువాత చలమేశ్వర్ రాసిన ముందుమాటలోని మాటలు బాగా గుర్తుకువచ్చాయి.
సిబాల్ వాదన
ఇక విషయంలోకి వెళ్తే.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ సిక్కిం జ్యుడీషియల్ అకాడెమీలో మాట్లాడుతూ భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్న కొలీజియంను విమర్శించారు. కొలీజియం వ్యవస్థ ద్వారా నియమింపబడిన న్యాయమూర్తులు తప్పనిసరిగా మెరిట్‌పై కాదని అన్నారు. అయితే యథాతథ స్థితిని కొనసాగించాలని అంతర్గత ఒత్తిడి ఉందని, అందువల్ల దాన్ని తొలగించాలని ఎవరూ కోరుకోవడం లేదని ఆయన అన్నారు. కొలీజియం వ్యవస్థ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తోంది.
జిల్లా న్యాయవ్యవస్థను, ‘సబార్డినేట్’ అనకూడదు
జిల్లా న్యాయవ్యవస్థని రాజ్యాంగంలో సబార్డినేట్ న్యాయవ్యవస్థగా పేర్కొన్నారు. సబార్డినేట్ న్యాయ వ్యవస్థ అని అనకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్తరచూ అన్న తరువాత హైకోర్టులు ఆవిధంగా సంబోధించడం మొదలుపెట్టాయి. ఎట్లా పిలిచినా పర్వాలేదు. ఆ న్యాయమూర్తులను మనుషుల మాదిరిగా చూస్తే చాలని చాలా మంది న్యాయమూర్తులు అనుకుంటారు. 1934లో భారత రాజ్యాంగాన్ని సంస్కరించేందుకు జాయింట్ సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జిల్లా న్యాయవ్యవస్థ గురించి ప్రస్తావించిందని, అది శ్వేతపత్రం కానప్పటికీ కొన్ని సిఫారసులను చేసిందని కపిల్‌సిబాల్ అన్నారు.
హైకోర్టు నియంత్రణలోకి సబార్డినేట్ న్యాయవ్యవస్థ
హైకోర్టు, ఫెడరల్ న్యాయమూర్తులని క్రౌన్ నియామకం చేస్తుందని సబార్డినేట్ జ్యుడీషియల్లోని న్యాయమూర్తులను భారతదేశంలోని అధికారులు నియామకం చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 1935 చట్టంలో సబార్డినేట్ న్యాయమూర్తుల ఎంపిక అంశాన్ని సె.254లో ప్రత్యేకంగా ఉదహరించారు. జిల్లా న్యాయమూర్తుల నియామకాన్ని ఆ ప్రావిన్స్ గవర్నర్ తన ఇష్టానుసారం నియామకం చేసే అధికారం కలిగి ఉంటాడు. అయితే, నియమించే ముందు సంబంధిత హైకోర్టుని సంప్రదించాల్సి ఉంటుంది. 1948లో జరిగిన న్యాయమూర్తుల సదస్సులో ఈ విషయాన్ని చర్చించినారు. ప్రొవిన్షియల్ ఎగ్జిక్యూటివ్‌పై ఆధారపడినంతకాలం ఆ న్యాయమూర్తులకు స్వేచ్ఛ లేదని ఆ సదస్సులో తేల్చినారు. వీటన్నింటి ప్రభావంతో ఆర్టికల్ 235 అనేది రాజ్యాంగంలోకి వచ్చింది. సబార్డినేట్ న్యాయవ్యవస్థపై నియంత్రణ హైకోర్టులకు ఇచ్చారు.
సబార్డినేట్ న్యాయమూర్తులు స్వతంత్రంగా ఉన్నారా?
‘ఎలాంటి ప్రభావం లేకుండా సబార్డినేట్ న్యాయమూర్తులు పనిచేస్తున్నారా?’ అని కపిల్ ప్రశ్నిస్తూ ఆవిధంగా లేరని ఆయనే జవాబు చెప్పాడు. దానికి కారణం కొలీజియం అని ఆయన పేర్కొన్నారు. అది కేంద్ర బిందువని అన్నారు. సబార్డినేట్ కోర్టులపై హైకోర్టుకి నియంత్రణ ఉంటుంది. హైకోర్టులపై సుప్రీంకోర్టు నియంత్రణని రాజ్యాంగం అనుమతించలేదు. హైకోర్టులు, సుప్రీంకోర్టుకి సబార్డినేట్ కాదు. ఎంట్రీ 67, లిస్ట్ 2లో సుప్రీంకోర్టు అధికార పరిధి వచ్చేచోట తప్ప మిగతా విషయాలలో సుప్రీంకోర్టు హైకోర్టు విషయాలలో జోక్యం చేసుకోలేదు. ఎంట్రీ 77, లిస్ట్1 ప్రకారం సుప్రీంకోర్టు అధికార పరిధి భారతదేశం మొత్తం ఉంటుంది. కానీ, సుప్రీంకోర్టు హైకోర్టు అధికార పరిధిని అడ్డుకోలేదు. అయినా, జిల్లా న్యాయమూర్తులు హైకోర్టువైపు, హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారని కపిల్ సిబల్ అన్నారు.
కొలీజియం వ్యవస్థ
గతంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు తమ నియామకాల కోసం రాజకీయ నాయకుల వద్దకు పరిగెత్తేవారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి కొలీజియం వ్యవస్థ వచ్చిందని కూడా సిబల్ అన్నారు. ఈ నియామక అధికారాన్ని ఎగ్జిక్యూటివ్ నుంచి న్యాయవ్యవస్థను తరలించడం జరిగిందని, ఇప్పుడు కొలీజియం వ్యవస్థలో సబార్డినేట్ న్యాయ మూర్తులు హైకోర్టు న్యాయమూర్తుల వద్దకు, హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వద్దకు పరుగెడుతున్నారు. తమని నియమించే వ్యక్తులకు దూరంగా ఉండాలని 1934లో కమిటీ భావించిందని కానీ అది బదిలీ అయిందే తప్ప తొలిగిపోలేదని కపిల్ సిబాల్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
జడ్జీలకు ప్రాంతీయ భాష మీద పట్టు ఉండాలి
న్యాయమూర్తులకు ప్రాంతీయభాష మీద పట్టు ఉండాలి. జాతీయాలు, నుడికారాలు, సామెతలు తెలిసి ఉండాలి. ఆ విధంగా తెలిసిన న్యాయమూర్తులే సాక్షుల వాంగ్మూలాని సమర్థవంతంగా నమోదు చేయగలరు. జిల్లా న్యాయమూర్తులకుప్రాంతీయ భాష రాకపోతే పార్టీలకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. జిల్లా న్యాయమూర్తుల స్వేచ్ఛ కూడా తగ్గిపోతుందని కపిల్సిబాల్ఆందోళన వ్యక్త పరిచారు. ఉత్తర్వులు రాసే ముందు హైకోర్టు న్యాయమూర్తులు ఏమని అనుకుంటారోనని ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రభుత్వ పాత్ర
సబార్డినేట్ జ్యుడీషియరీలో చాలా అసంతృప్తి ఉంది. దానికి కారణం వారు పూర్తిగా హైకోర్టు నియంత్రణలో ఉండటం. దానివల్ల ప్రతి న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తులతో సమీకరణని కలిగి ఉంటున్నారు. ప్రధాన న్యాయమూర్తి నియామకం విషయంలో ప్రభుత్వ పాత్ర ఉండటం వల్ల అది మరింత ఘోరంగా మారుతుందని సిబాల్ ఆందోళన వ్యక్తం చేశాడు. జిల్లా జడ్జీల నియామకం జాతీయ స్థాయిలో ఉండ కూడదని కూడా ఆయన అన్నారు. ఒకటి రెండు లా కమిషన్లు ఆవిధంగా సిఫారసు చేశాయని, దానివల్ల పరిస్థితులు మరింత ఘోరంగా ఉంటాయని కూడా అన్నారు. జిల్లా న్యాయమూర్తుల ఎంపిక జాతీయ ప్రాతిపదికన చేయడం అనర్థకమే. న్యాయవ్యవస్థ మిగతా వ్యవస్థల మాదిరిగా కాదు.
- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్)