సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. హస్తం పార్టీకి హ్యాండిచ్చి సైకిల్ ఎక్కారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాంగోపాల్ యాదవ్, ఉత్తమ్ పటేల్ సహా పలువురు నేతలు సిబల్ వెంట ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ కపిల్ సిబల్తో పాటు జావేద్ అలీ, డింపుల్ యాదవ్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది.

వాస్తవానికి ఈ నెల 16 వ తేదీనే కపిల్ సిబల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అయితే ఈ విషయంపై ఈ రోజు వరకు అటు కాంగ్రెస్ గానీ, ఇటు సిబల్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పేందుకు సోనియా గాంధీ సిద్ధమైన నేపథ్యంలో కపిల్ సిబల్ సహా పలువురు పార్టీ సీనియర్లు హైకమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీ 23 పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. గులాం నబీ ఆజాద్ నాయకత్వం వహించిన ఈ జట్టు పార్టీలో అత్యవసరంగా నాయకత్వ మార్పు అవసరమని తిరుగుబాటు జెండా ఎగరేశారు. తాజాగా ఎస్పీలో చేరిన కపిల్ సిబల్ రాజీనామాపై స్పందించారు. పార్టీ నుంచి వైదొలగినందున ఇప్పుడు మాట్లాడటం సరికాదని అన్నారు. కాంగ్రెస్తో 30ఏళ్ల బంధాన్ని తెంచుకోవడం అంత సులువేమీకాదని చెప్పారు.  కపిల్ సిబల్ నామినేషన్పై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున సీనియర్ నేత కపిల్ సిబల్‌ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసినట్లు చెప్పారు.