
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కోలుకోకుండా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కుట్రలు చేస్తోందని రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ఇందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తోందన్నారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ ఇచ్చిన నోటీసులు ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడేనని పేర్కొన్నారు.
ఈమేరకు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆ వార్తా పత్రికకు సంబంధించిన భవనాల్లో కాంగ్రెస్ కార్యాలయాలు నడుస్తున్నాయని కపిల్ సిబల్ గుర్తుచేశారు. వాటిని మూసివేయించాలనే ఉద్దేశంతోనే ఆయా కార్యాలయాలకు ఈడీతో నోటీసులు పంపించారని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి ఇన్నేండ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ ఎందుకు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
బీజేపీ.. నియంతృత్వానికి తండ్రి
ప్రజాస్వామ్యానికి బీజేపీ తల్లివంటిదని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు.. నిజానికి ఆ పార్టీ నియంతృత్వానికి తండ్రివంటిదని సిబల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ–ముస్లిం ఎజెండాపై
రాజకీయాలు చేయాలని చూస్తూ, ప్రతిపక్షాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.