PSL 2025: కరాచీలో కేన్ మామ సందడి: ఐపీఎల్‌కి నో ఛాన్స్.. పాక్ లీగ్‌పై విలియమ్సన్ దృష్టి

PSL 2025: కరాచీలో కేన్ మామ సందడి: ఐపీఎల్‌కి నో ఛాన్స్.. పాక్ లీగ్‌పై విలియమ్సన్  దృష్టి

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ సెమీస్ కు చేరి జోరు మీదుంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా సెమీస్ కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్ లో భారత్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 2 న దుబాయ్ వేదికగా జరగనుంది. బంగ్లాతో మ్యాచ్ తర్వాత 5 రోజుల విరామం ఉండడంతో విలియంసన్ కరాచీలో సందడి చేస్తూ కనిపించాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో తన తొలి సీజన్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్నాడు కాబట్టి విరామ సమయంలో రావల్పిండి నుంచి కరాచీకు వెళ్లి ఫోటోషూట్ కోసం కొన్ని గంటల పాటు కరాచీ కింగ్స్ జట్టుతో గడిపాడు. ఈ ఫోటో షూట్ లో నీలం,ఎరుపు రంగులను కలగలిపిన జెర్సీని ధరించిన కొన్ని ఫోటోషూట్ వీడియోలను కరాచీ కింగ్స్ షేర్ చేసుకుంది. ఐపీఎల్ లో విలియంసన్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోగా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో అతనికి ఊరట దక్కింది.వేలంలో  విలియమ్సన్ ప్లాటినం రౌండ్‌లో అమ్ముడుపోలేదు. అయితే అతన్ని డైమండ్ రౌండ్‌లో కరాచీ కింగ్స్ దక్కించుకుంది.

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2025 పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ తరపున ఆడనున్నాడు. పాకిస్తాన్ టీ20 లీగ్ 10వ ఎడిషన్ ఏప్రిల్ 8 నుండి మే 19 వరకు జరుగుతుంది. ఐపీఎల్ కు సమాంతరంగా ఈ టోర్నీని నిర్వహించనున్నారు. పీఎస్‌ఎల్, ఐపీఎల్‌ రెండు ఒకేసారి జరగడం ఇదే తొలిసారి. విలియమ్సన్, వార్నర్ తో పాటు టామ్ కుర్రాన్, సామ్ బిల్లింగ్స్, డారిల్ మిచెల్, అల్జారి జోసెఫ్, షాయ్ హోప్ , జాసన్ హోల్డర్ వంటి స్టార్ ఆటగాళ్లు పీఎస్‌ఎల్ 10లో ఆడనున్నారు.