విజయవాడ--జగదల్​పూర్​ నేషన్​ హైవే మీదుగా కరకట్ట

  •     ఇరిగేషన్​ లెటర్​తో సర్వే చేపట్టిన ఎన్​హెచ్​ ఇంజినీర్లు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని కూనవరం రోడ్డులో అసంపూర్తిగా మిగిలిన కరకట్ట నిర్మాణం పనులకు ప్రభుత్వం రూ.38.45కోట్లు మంజూరు చేసింది. పనులను శ్రీహర్ష కనస్ట్రక్షన్స్ చేజిక్కించుకుంది. 

అయితే ఈ కరకట్ట విజయవాడ-జగదల్​పూర్​ జాతీయ రహదారి మీదుగా చేపట్టాల్సి ఉంది. దీంతో నేషనల్​ హైవే అనుమతి కోసం భద్రాచలం ఇరిగేషన్​ శాఖ లేఖ రాసింది. ఈ క్రమంలో శనివారం బెంగళూరుకు చెందిన సాత్విక్​ ఇంజినీరింగ్​ కన్సల్టెన్సీ(ఎస్​ఈసీ)తో ఎన్​హెచ్​ ఇంజినీర్లు సర్వే ప్రారంభించారు. 

హైవేపై 40 అడుగుల మట్టికట్ట

700 మీటర్ల మేర నిర్మించే గోదావరి కరకట్ట సరస్వతీ శిశుమందిర్​ స్కూల్​ దాటాక హైవేను క్రాస్​చేస్తోంది. ఎస్​ఈసీ కన్సల్టెన్సీ చేపట్టిన సర్వే ప్రకారం హైవేపై 40 అడుగుల మేర కరకట్ట కట్టాల్సి ఉంది. ఇటువంటి సమయంలో హైవేను ఈ కట్ట మీదుగా తీసుకెళ్లాలి. ఇక్కడ ఫ్లైఓవర్​ కట్టాలా? లేక రోడ్డునే నిర్మించాలా..? అనేది హైవేస్​ ఇంజనీర్లు డిజైన్​ చేయాలంటే ఈ సర్వే నివేదిక తప్పనిసరి. 

అయితే కట్టను దాటే సమయంలో హైవే పెద్ద మలుపు వచ్చింది. దీంతో రోడ్డను స్ట్రైట్​గా తీసుకెళ్లాలంటే మళ్లీ భూసేకరణ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ కరకట్ట నిర్మాణానికి 33 ఎకరాల రైతుల భూములను ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుత సర్వే ప్రకారం రోడ్డు డిజైన్​ మార్చాల్సి వస్తే తప్పనిసరిగా పక్కనే ఉన్న రైతుల నుంచి మరికొంత భూమిని సేకరించాల్సి ఉంటుంది. 

దీనికి సంబంధించి నేషనల్ హైవేస్​ కరకట్ట నిర్మాణానికి గ్రీన్​సిగ్నల్​ ఇవ్వాలంటే వారు సూచించిన డిజైన్​ ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఎన్​హెచ్​ చేయిస్తున్న సర్వే కరకట్ట నిర్మాణం కీలకం కానుంది. ఈ సర్వే రెండు రోజులపాటు కొనసాగనుంది.