పల్నాడు ఉద్రిక్తం... కారంపూడి టీడీపీ ఆఫీసుపై దాడి - ...వాహనాలకు నిప్పు

పల్నాడు జిల్లా కారంపూడి మండల కేంద్రంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. . కారంపూడిలోని తమ కార్యాలయంపై అధికార పార్టీ శ్రేణులు దాడి చేసినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాడి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. మే 13 పోలింగ్ రోజున ఉద్రిక్తతల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు పేటసన్నెగండ్ల గ్రామానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తున్నారు. ఆ క్రమంలోనే కారంపూడిలో తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే భయానక వాతావరణం సృష్టించారని అంటున్నారు.

టీడీపీ కార్యాలయం ధ్వంసం చేయటంతో పాటు అక్కడ ఉన్న టీడీపీ నేత జానీ బాషా వాహనానికి నిప్పు అంటించారు.  దాడులు ఆపేందుకు ప్రయత్నించిన కారంపూడి సీఐ నారాయణ స్వామిపై కూడా దాడికి తెగబడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీఐ నారాయణస్వామికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ఘటనలతో పల్నాడు జిల్లా కారంపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది కారంపూడి పట్టణంలో మారణాయుధాలతో హడావుడి చేశారు. కనపడిన వారిని కనపడ్డట్టు టీడీపీ కార్యకర్తలను తరిమి తరిమి కొట్టారు. చెక్ పోస్ట్ సెంటర్లో టీడీపీకి సంబంధించిన ఓ కారును తగులబెట్టారు. ఈ ఘటనల నేపథ్యంలో కారంపూడి ప్రజలు భయబ్రాంతులు చెందుతున్నారు.