ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ విగ్రహంలో ఎలాంటి మార్పులు చేసి, ప్రతిష్టించాలని ప్రయత్నించినా తాము అడ్డుకుంటామని కరాటే కల్యాణి పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించవద్దని డిమాండ్ చేస్తున్నారామె. NTR విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్ని మార్పులు చేసినా విగ్రహాన్ని పెట్టనివ్వమన్నారు. నెమలి పించం తీసేసినా, పిల్లన గ్రోవి తీసేసినా, విష్ణు చక్రం తీసేసినా అది శ్రీ కృష్ణుడు విగ్రహామే అవుతుందని, శ్రీ కృష్ణ పరమాత్ముడిని మరింత అపవిత్రం చేయవద్దని కోరారు.
ఎన్టీఆర్ విగ్రహంతో రాజకీయం చేయడం తగదన్నారు కరాటే కల్యాణి. న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా ముందుకెళ్తే తాము మరోసారి కోర్టుకెళ్తామని చెప్పారు. కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకోవద్దంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను హెచ్చరించారు. మరోసారి హిందువులు, యాదవుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని, తప్పనిసరిగా ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటు అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ పై కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే.. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని పలు హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఇస్కాన్, యాదవ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎన్టీఆర్ విగ్రహం పెట్టొద్దని మంత్రి పువ్వాడ అజయ్ సహా నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. హైకోర్టు నిర్ణయంతో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. మే 28న ఎన్టీఆర్ శజయంతి ఉత్సవాలు జరగనున్నాయి.