ముంబై: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి కేసు దర్యాప్తును బాంద్రా పోలీసులు స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా శనివారం సైఫ్ భార్య కరీనా కపూర్ ఖాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. దాడికి పాల్పడిన టైంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని పోలీసులకు కరీనా కపూర్ చెప్పారు. దాదాపు ఆరుసార్లు కత్తితో సైఫ్ పై దాడికి పాల్పడ్డాడని తెలిపారు. అయితే అతడు తమ ఇంట్లో వస్తువులనుగానీ, నగలనిగానీ తాకలేదని వెల్లడించారు. "చిన్న కొడుకు జేహ్, కేర్ టేకర్ ను కాపాడే ప్రయత్నంలో దుండగుడితో సైఫ్ పోరాడాడు. ఈక్రమంలోనే అతడు సైఫ్ పై కత్తితో దాడి చేశాడు.
ఘటన తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు ధైర్యం చెప్పడానికి మా సోదరి కరిష్మా వచ్చింది. నన్ను ఖార్లోని తన ఇంటికి తీసుకెళ్లింది" అని కరీనా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తున్నది. మరోవైపు..సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. నిందితుడికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిప్రకారం.. ఘటన జరిగిన తర్వాతి రోజు నిందితుడు బాంద్రా రైల్వే స్టేషన్‌లో కనిపించాడు.
దాదర్‌లోని మొబైల్ స్టోర్‌లో ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేశాడు. అనంతరం అతడు బాంద్రా స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కి వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, సైఫ్ స్పీడ్‌గా రికవరీ అవుతున్నాడని ముంబైలోని లీలావతి ఆస్పత్రి డాక్టర్లు శనివారం వెల్లడించారు. సైఫ్‌ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చినట్లు చెప్పారు. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు.
అనుమానితుడి అరెస్ట్
సైఫ్ అలీఖాన్‌పై కత్తిపోటు కేసులో ఓ అనుమానితు డిని చత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆకాశ్ కైలాశ్ కన్నోజియా(31) అనే వ్యక్తిని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. అతను ప్రస్తుతం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కస్టడీలో ఉన్నాడు. వీడియో కాల్ ద్వారా నిందితుడిని ముంబై పోలీసు లతో మాట్లాడించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి సైఫ్ పై దాడిచేసిన నిందితుడేనా కాదా అని నిర్ధారించేందుకు ముంబై నుంచి ఓ పోలీసు బృందం దుర్గ్‌కు బయలుదేరినట్లు తెలుస్తున్నది.