- కరీంనగర్ కార్పొరేషన్‌లో పదేళ్ల కిందే ఆరు అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం
- భవన నిర్మాణ అనుమతి లేకుండానే స్కూల్ నడుపుతున్న యాజమాన్యం
- కమర్షియల్‌కు బదులుగా రెసిడెన్షియల్ అంటూ రికార్డుల్లో నమోదు
- మున్సిపల్ ఆదాయానికి లక్షల్లో గండి
- నోటీసులతోనే సరిపెడుతున్న ఆఫీసర్లు
కరీంనగర్, వెలుగు : సామాన్య జనం తమ అనుమతి లేకుండా చిన్న రేకుల షెడ్ వేసినా వెంటనే కూల్చివేసే మున్సిపల్ ఆఫీసర్లకు.. కనీస పర్మిషన్ కూడా లేకుండానే ఆరు అంతస్తుల్లో నడుస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ మాత్రం కనిపించడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల నుంచి యథేచ్ఛగా స్కూల్ నడుస్తున్నా అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
సదరు స్కూల్ ఉన్న కాలనీ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు బిల్డింగ్ కట్టారని తప్పించుకుంటున్న మున్సిపల్ ఆఫీసర్లు.. రీ అసెస్‌మెంట్ గురించి మాత్రం స్పందించడం లేదు. కరీంనగర్ పద్మానగర్‌లో ఉన్న పారమిత స్కూల్‌పై ఓ వ్యక్తి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడంతో ఏడాదిగా నోటీసులు ఇస్తున్నారే తప్ప అంతకుమించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
మున్సిపల్ ఆదాయానికి లక్షల్లో గండి
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డుల ప్రకారం పద్మానగర్‌లోని ఇంటి నంబర్ 16--–2–61/3/2 లో 999 చదరపు అడుగుల్లో రెసిడెన్షియల్ ఇల్లు ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఫీల్డ్‌లో మాత్రం ఆ ఇంటి నంబర్‌తో ఆరంతస్తుల స్కూల్ బిల్డింగ్ ఉంది. ఆరు అంతస్తుల్లో మూడు బిల్డింగ్స్‌తో సుమారు లక్ష చదరపు అడుగులు ఉన్న ఈ బిల్డింగ్‌ను కమర్షియల్ కేటగిరీలో చేర్చి ప్రతి ఏటా సుమారు రూ. 2 లక్షల మేర ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉంది.
కానీ రెసిడెన్షియల్ కేటగిరిలో చూపుతూ కేవలం రూ.41,024 మాత్రమే వసూలు చేస్తున్నారు. మరో వైపు ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఎలాంటి అనుమతుల్లేని విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై మోరె గణేశ్ అనే వ్యక్తి ఒకే ఏడాదిలో ఆరు సార్లు ఫిర్యాదు చేసినా ఆఫీసర్లు రెండుసార్లు నోటీసులు ఇవ్వడం తప్ప.. అంతకుమించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నోటీసులతోనే సరి
బిల్డింగ్ పర్మిషన్ ప్లాన్, రిజిస్ట్రేషన్, లింక్ డాక్యుమెంట్లను ఏడు రోజుల్లో అందజేయాలని మున్సిపల్ ఆఫీసర్లు పారమిత స్కూల్ యాజమాన్యానికి గతేడాది జూలై 31న నోటీసులు ఇచ్చారు. కానీ స్కూల్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రాతపూర్వక వివరణతో 2023 ఆగస్టు 17న సాయంత్రం 4 గంటలకు డిప్యూటీ సిటీ ప్లానర్ ఛాంబర్‌లో హాజరుకావాలని మరోసారి సమాచారమిచ్చినా స్కూల్ మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదు. స్కూల్ నుంచి కనీస స్పందన లేకపోయినా ఆఫీసర్లు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు. దీంతో గణేశ్ ఈ నెల 10న మరోసారి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు.
అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలతో డిప్యూటీ సిటీ ప్లానర్ స్కూల్ మేనేజ్‌మెంట్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందించనందున మున్సిపల్ యాక్ట్ ప్రకారం బిల్డింగ్‌ను డైరెక్ట్‌గా కూల్చేయడం లేదంటే భారీగా ఫైన్ విధించే అధికారం కమిషనర్‌కు ఉన్నప్పటికీ ఆయన పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సీజ్ చేయాలని ఆదేశించా
పారమిత స్కూల్‌కు ఇప్పటికే డిప్యూటీ సిటీ ప్లానర్ నోటీసులు ఇచ్చారు. పర్మిషన్ లేని బిల్డింగ్‌ను సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించాం. పద్మానగర్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడే ఆ బిల్డింగ్ నిర్మించినట్లు తెలిసింది. రీ అసెస్‌మెంట్ కూడా చేయాలని ఆదేశించాం.
- బోనగిరి శ్రీనివాస్, కమిషనర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్