కరీంనగర్ అడిషనల్ కలెక్టర్​పై ట్రోలింగ్​

కరీంనగర్ అడిషనల్ కలెక్టర్​పై ట్రోలింగ్​
  •     నకిలీ దివ్యాంగుడని ‘ఎక్స్’ లో నెటిజన్ల పోస్టులు  
  •     పూజా ఖేద్కర్ పై ఆరోపణల నేపథ్యంలో తీవ్ర చర్చ  
  •     నా డిజబిలిటీని ఎయిమ్స్ సర్టిఫై చేసింది  
  •     ఇప్పుడు కూడా ఏ పరీక్షకైనా సిద్ధం : ప్రపుల్​ దేశాయ్​

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. దివ్యాంగుల కోటాలో ఆయన సివిల్స్ కు సెలక్టయ్యారని, ఆయనలో ఎలాంటి లోపం లేదంటూ ఆయన ట్రెక్కింగ్, గుర్రపు స్వారీ, బ్యాడ్మింటన్ ఆడుతున్న ఫొటోలను కొందరు షేర్ చేస్తున్నారు. దివ్యాంగుడైన ప్రఫుల్ దేశాయ్ కి ఇంతలా ఫిజికల్ యాక్టివిటీస్ ఎలా సాధ్యమంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించడంతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

దీంతో ఆమె ట్రైనింగ్​ను నిలిపివేశారు. ఖేద్కర్ పై ఆరోపణల నేపథ్యంలో తాజాగా ప్రఫుల్ దేశాయ్ ఫొటోలను షేర్ చేస్తూ సాక్షి(333 మహేశ్వరి) పేరిట ఎక్స్ లో అకౌంట్ కలిగిన ఓ యువతి షేర్ చేసి వివరణ కోరారు. ‘2019 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అయిన ప్రఫుల్ దేశాయ్ అనే మీరు ఈడబ్ల్యూఎస్, ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్  కేటగిరీలో ఉద్యోగం తెచ్చుకున్నారు. మీరు సైక్లింగ్ చేస్తున్న, టెన్నిస్ ఆడుతున్న, గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలు ట్విటర్ లో షేర్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు పబ్లిక్ గా కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఉన్నట్టుండి మీరు మీ అకౌంట్ ను ప్రైవేట్ లోకి మార్చేశారు. మీరు ఎందుకు భయపడుతున్నారు’ అని ఎక్స్​లో ప్రపుల్​ను ప్రశ్నించారు. 

ఆ ఫొటోలు ట్రైనింగ్​లోనివి... 

అయితే, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్​దేశాయ్​తనను అనుమానిస్తూ వచ్చిన ట్వీట్లకు సమాధానం ఇచ్చారు. ‘జీవితంతో పోరాడుతున్నా, ఎలాంటి పరీక్షకైనా సిద్ధమే. వైరల్ అవుతున్న ఫొటోలన్నీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగమే..దివ్యాంగుడినైన నేను ఆ పరిస్థితులను అధిగమించి అందరిలా జీవించేందుకు ప్రయత్నించడం తప్పా’ అని సూటిగా ప్రశ్నించారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ బోర్డు ముందు హాజరయ్యానని, అక్కడి డాక్టర్లే తనలోఉన్న లోపాన్ని సర్టిఫై చేశారని, అదే రిపోర్టును డీఓపీటీకి పంపారని గుర్తు చేశారు. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం వ్యక్తిత్వ హననమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్ నమ్మొద్దని కోరారు.