ఏసీబీకి చిక్కిన కరీంనగర్ మార్కెట్ సెక్రటరీ

ఏసీబీకి చిక్కిన కరీంనగర్ మార్కెట్ సెక్రటరీ
  • పండ్ల వ్యాపారుల లైసెన్స్ రెన్యువల్ కు లంచం డిమాండ్ 

 కరీంనగర్, వెలుగు: పండ్ల వ్యాపారుల లైసెన్స్ రెన్యువల్ కోసం మార్కెట్ సెక్యూరిటీ గార్డు ద్వారా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ ఎవ్సం పురుషోత్తం రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితులు, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల  ప్రకారం..  కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో బిజినెస్ చేసే మహమ్మద్ అబ్దుల్ గాఫుర్ అలియాస్ నిమ్మకాయల పాషా, సుల్తానా ఆబీర్ తోసహా 12 మంది హోల్ సేల్ పండ్ల వ్యాపారులు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లోని శ్రీపాదరావు ఫ్రూట్స్ మార్కెట్ లో బిజినెస్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తమ వ్యాపారానికి సంబంధించిన కమిషన్ ఏజెంట్ లైసెన్స్ పునరుద్ధరణ కోసం ఇటీవల కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఎవ్సం పురుషోత్తంను కలిశారు. 

దీనికి ఆయన ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమని వేడుకోగా రూ. లక్ష అయినా ఇవ్వాలని కోరాడు. చివరికి ఒక్కొక్కరు రూ.60 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఆరుగురు వ్యాపారుల నుంచి రూ.3.60 లక్షలు తీసుకున్నాడు.  అయినప్పటికీ లైసెన్స్ రెన్యువల్ చేయకపోవడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.  పండ్ల వ్యాపారుల నుంచి మార్కెట్ సెక్యూరిటీ గార్డు (ఔట్ సోర్సింగ్) కరివేద శ్రీనివాస్ రెడ్డి ద్వారా పురుషోత్తం రూ.60 వేలు లంచంగా తీసుకుంటుండగా వెంటనే ఏసీబీ ఆఫీసర్లు రంగంలోకి దిగి పురుషోత్తంతోపాటు అతడికి ఏజెంట్ గా వ్యవహరించిన శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపరిచారు.